బ్యాంకుల నయా ఆకర్షణీయమైన ఫిక్సిడ్ డిపాజిట్ పథకాలు
కొవిడ్ కారణంగా దేశంలో గత రెండేళ్లుగా దేశంలో డిపాజిట్ రేట్లు కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఫలితంగా రుణరేట్లు కూడా తక్కువగా ఉండడంతో రుణ గ్రహీతలకు పరిస్థితి అనుకూలంగానే ఉండేది. కానీ, తమ వద్ద ఉన్న నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీ మీదే ఆధారపడిన ఎంతోమంది మాత్రం తక్కువ ప్రతిఫలంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు కుదుట పడి, రుణాలకు గిరాకీ పెరగడంతో, నిధులను వేగంగా సమీకరించేందుకు మళ్లీ బ్యాంకులు అనేక ప్రత్యేక డిపాజిట్ పథకాలనూ అందుబాటులోకి తెచ్చి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడం ప్రారంభించాయి. ఫలితంగా డిపాజిటర్లు ఆనందంతో ఉన్నారు.

కరోనా ప్రభావం తగ్గి, వ్యాపార కార్యకలాపాలు ఉపందుకోవడంతో, రిటైల్, కార్పొరేట్, వ్యవసాయ, వర్గాల నుంచీ రుణాలకు గిరాకీ పెరుగుతోంది. కానీ బ్యాంకుల నిధి సమీకరణకు ప్రధాన వనరైన డిపాజిట్లలోకి డబ్బు ఆ స్థాయిలో రావడం లేదు. ఇటీవలి వరకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో డిపాజిట్‌దారులు ప్రత్యామ్నాయంగా మ్యూచువల్ ఫండ్లలో, షేర్ల కొనుగోలుకు, మదుపు చేసేందుకు ఆసక్తి చూపారు. మార్కెట్ పతనం అయితే.. తమ పెట్టుబడులు వెంటనే ఉపసంహరించడం సాధ్యం కాదనే భావనతో ఉన్న వారు మాత్రం బ్యాంకు డిపాజిట్లలోనే తమ నిధులు డిపాజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయిదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్ పథకంలోల 7.4 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టేందుకు దీన్ని చాలామంది ఎంచుకుంటున్నారు. స్వల్పకాలిక రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలైన గృహ, వాహన రుణాలనూ బ్యాంకులు అధికంగా ఇస్తున్నాయి. బ్యాంకులకు నిధులు రుణంగా ఇచ్చి, RBI వసూలు చేసుకునే వడ్డీ (రెపో రేటు) 5.40 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో, బ్యాంకులు నిధులు సమీకరించుకునేందుకు రిటైల్ డిపాజిటర్లపై దృష్టి పెట్టాయి. అందుకే, పోటీలు పడి, సంప్రదాయ వ్యవధులకు భిన్నంగా ప్రత్యేక డిపాజిట్ పథకాలను ప్రవేశ పెడుతున్నాయి.
పండగలు ముందున్నందున..
వినాయక చవితి మొదలుకొని.. దేశంలో పండగల సీజన్ ప్రారంభం అయి, డిసెంబరు వరకు కొనసాగుతుంది. ఈ సీజనులో చాలామంది కొత్త వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా గృహోపకరణాలు, వాహనాలు, రుణంపై ఎక్కువగా అమ్ముడవుతాయి. గడిచిన రెండేళ్లుగా కోవిడ్ పరిణామాల నేపథ్యంలో రిటైల్ రుణాలకు గిరాకీ అంతంత మాత్రంగానే ఉంది. ఈసారి ఈ రుణాలకు వినియోగదారుల నుంచి అధికంగా ఆదరణ ఉంటుందని భావించి…డిపాజిట్లు రాబట్టుకునేందుకు ప్రత్యేక పథకాలతో బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.

