ఉమ్మడి వరంగల్ జిల్లా
తొలి ఎన్నికల్లోనే రాజకీయ నేత ఎర్రబెల్లిని ఓడించిన 26 ఏళ్ల యశస్వినిరెడ్డి. పాలకుర్తి నుండి భారీ మెజార్టీతో గెలుపొందారు.
పరకాల, నర్సంపేట, వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. గతంలో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా నర్సంపేట నుండి గెలిచిన రేవూరి ప్రకాష్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి పరకాల అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.
గతంలో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి బీఆర్‌ఎస్ నుండి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఉమ్మడి వరంగల్ నుండి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న ఎమ్మెల్యేలలో కాంగ్రెస్ నుండి మెజార్టీ ఉండగా.. బీఆర్ఎస్ నుండి ఒక్కరున్నారు. డోర్నకల్ నుండి జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ నుండి డాక్టర్ మురళీనాయక్, పాలకుర్తి నుండి మామిడాల యశస్వినిరెడ్డి, వర్ధన్నపేట నుండి కే.ఆర్. నాగరాజు, వరంగల్ పశ్చిమ నుండి నాయిని రాజేందర్ రెడ్డి, భూపాలపల్లి నుండి గండ్ర సత్యనారాయణరావు ఉన్నారు. జనగామ నుండి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుండి పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా మొదటిసారి అసెంబ్లీలో కాలు పెడుతున్నారు.
ఉమ్మడి వరంగల్ నుండి ముగ్గురు మహిళా నేతలు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఇందులో ములుగు, వరంగల్ తూర్పు, పాలకుర్తి నుండి గెలుపొందిన ధనసరి సీతక్క, కొండా సురేఖ, మామిడాల యశస్వినిరెడ్డిలు ఉన్నారు. ముగ్గురూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే.