రాష్ట్రం వైపు శీతల గాలులు..
రాష్ట్రంలో చలికాలం ప్రారంభమైంది. అధిక మాసం వలన ఈసారి చలి కాస్త లేటుగానే వచ్చింది. మూడు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి వేళల్లోనూ ప్రజలు ఉక్కపోతతో సతమతమయ్యారు. రుతుపవనాలు వెనక్కు వెళ్లడంతో రాష్ట్రం వైపు శీతల గాలులు ప్రవేశించాయి.
హైదరాబాద్: రాష్ట్రంలో చలికాలం ప్రారంభమైంది. అధికమాసం కారణంగా చలి కొంత ఆలస్యమే అయింది. మూడు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి వేళల్లోనూ ప్రజలు చాలా వేడిమిని ఎదర్కొన్నారు, చెమటలు పోశాయి. రుతుపవనాలు తిరుగు ముఖం పట్టడంతో రాష్ట్రం వైపు శీతల గాలులు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు వెళ్లాయి. ఉదయాన్నే పొగమంచు కమ్మేస్తోంది. హనుమకొండలో సాధారణం కన్నా 2.9 డిగ్రీలు తగ్గి.. కనిష్ఠ ఉష్ణోగ్రత 18.5 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌లో 1.9 డిగ్రీలు తగ్గిన 16.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. పగటివేళ హనుమకొండ, మెదక్, రామగుండంలలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఖమ్మంలో మాత్రం సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా.. గరిష్ఠ ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్, భద్రాచలం, ఆదిలాబాద్‌లలోనూ సాధారణం కన్నా కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.