ఒకే వేదిక పైకి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు
• ఉభయ రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న విశాఖ పర్యటన
• రాజ శ్యామల యాగంలో పాల్గొననున్న ఇద్దరు సీఎంలు
•జగన్ మద్దతును కెసీఆర్ కోరే అవకాశం?
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావులు ఒకే రోజు ఒకే వేదికలో ఒకే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీంతో వారి పర్యటనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈనెల 28వ తేదీ విశాఖ శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఇటీవల తాడేపల్లి వచ్చి స్వయంగా సీఎం జగన్ ను యాగానికి ఆహ్వానించారు. అదేవిధంగా గతంలో హైదరాబాదులో రాజశ్యామల యాగం తలపెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా స్వామీజీ విశాఖకు ఆహ్వానించారు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులు రాజశ్యామల యాగంలో పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు శనివారం విశాఖకు రానున్నారు.

ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ యాగం అనంతరం ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది. భారత రాష్ట్ర సమితి పార్టీ కి మద్దతు ఇవ్వమని సీఎం జగన్ ను కేసిఆర్ కోరే అవకాశం ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోని అధికార పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. రాజశ్యామల యాగం కార్యక్రమానికి హాజరవుతున్న ముఖ్యమంత్రులు అసలు అక్కడ రాజకీయం గురించి ప్రస్తావిస్తారా అటువంటి అంశాలు చర్చించుకుంటారా అసలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా అనే వాదన కూడా మరి కొంతమందిలో బలంగా వినిపిస్తుంది. అయితే యాగం అనంతరం కొంతసేపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకునే సందర్భం అయితే ఉంటుందని అటు తెలంగాణలోని ఆ పార్టీ వర్గాలు ఇటు ఏపీలోని వైసీపీ వర్గాలు అనుకుంటున్నారు.

మర్యాదపూర్వకంగా భేటీలు సర్వసాధారణమే అయినప్పటికీ విశాఖ వేదికగా రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయని ఒకవేళ వస్తే కేసీఆర్ జగన్ మద్దతు కోరే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల కేసీఆర్ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల అగ్ర నేతలను ఆహ్వానించి భారత రాష్ట్ర సమితి పార్టీ సత్తాను చాటుకున్న విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించి బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేశాక జగన్ కేసీఆర్ కలవటం కూడా ఇదే తొలిసారి కావటంతో అన్ని వర్గాల్లోనూ వారి భేటీపై కొత్త చర్చ జరుగుతుంది.