Breaking Newshome page sliderHome Page SliderNationalNewsviral

మీటింగ్ లో సీఎం భర్త.. విపక్షాల సెటైర్లు

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ఎందుకంటే ఆమె భర్త, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త మనీష్ గుప్తా ప్రభుత్వ సమావేశంలో ఆమె పక్కన కూర్చున్నారు. దీనితో ఢిల్లీ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించడానికి జరిగిన సమావేశానికి మనీష్ గుప్తా హాజరయ్యారు.సమావేశంలో సీఎం రేఖా గుప్తా భర్త ఆమె పక్కన కనిపిస్తున్నారు. ఇది ప్రతిపక్ష నేతల దృష్టిని ఆకర్షించింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జ్ సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ, ఢిల్లీ ప్రభుత్వంలో రేఖా గుప్తా భర్త మనీష్ భాగస్వామి కానప్పుడు అతనిని అధికారిక సమావేశంలో కూర్చొనేందుకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేసే చర్య అని ఆయన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి తన భర్తకు కూడా అధికారాలు ఇవ్వాలనుకుంటోందని ఆరోపించారు. మరో నేత సంజయ్ సింగ్ కూడా రేఖా గుప్తాను విమర్శించారు. ప్రధాని మోదీ ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించారని ఎద్దేవా చేశారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి, ఆమె భర్త సూపర్ సీఎం అంటూ సెటైర్లు వేశారు.