తెలంగాణాలో ప్రారంభమైన సీఎం అల్పాహార పథకం
తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో సీఎం అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే దసరా కానుకగా ఈ పథకాన్ని ఈ రోజు నుంచే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తెలంగాణాలోని ప్రభుత్వ పాఠశాల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారాన్ని అందిస్తారు. ఈ మేరకు ఈ రోజు సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో మంత్రి కేటీఆర్,రావిర్యాలలో మంత్రి హరీశ్‌రావు,సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు.తెలంగాణాలో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక స్కూల్ చొప్పున మొత్తం 119 చోట్ల ఆయా ప్రజా ప్రతినిధులు ఈ పథకాన్ని ఆరంభించారు. అయితే త్వరలోనే దశలవారీగా ఈ పథకాన్ని తెలంగాణాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు విస్తరిస్తారు.కాగా ఈ పథకాన్ని ప్రారంభించడం పట్ల విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

