Home Page SliderNational

సిద్ధరామయ్యకు సీఎం పీఠం, ఖరారు చేసిన కాంగ్రెస్ హైకమాండ్

కర్నాటక సీఎం విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి వ్యవహరించింది. సిద్ధరామయ్యకు సీఎం పీఠం ఇవ్వబోతున్నట్టు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ డీకే శివకుమార్ కు తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం సిద్ధరామయ్య మద్దతుదారులు పటాకులు పేల్చి, స్వీట్లు పంచుతూ కనిపించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత కర్నాటక ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ నాలుగో రోజు కొనసాగింది. కేబినెట్‌ను ప్రకటించేందుకు మరో 48 గంటలు, మరో 24 గంటలు పట్టవచ్చని కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. సిద్ధరామయ్యకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉండటం, ఇవే చివరి ఎన్నికలను ఆయన ప్రకటించిన నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆయనవైపు మొగ్గుచూపింది. ఈ తరుణంలో డీకే శివకుమార్ విషయంలో రాహుల్ గాంధీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అన్నీ నేను చూసుకుంటాను. మీ పని మీరు చేసుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ ఆయన తేల్చి చెప్పారు. సీఎం పీఠం విషయంలో ససేమిరా అంటున్న పీసీసీ చీఫ్ డికే శివకుమార్ విషయంలో డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌గా కంటిన్యూ అయ్యేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.

అంతకు ముందు సీఎంగా సిద్ధరామయ్యను ప్రకటిస్తామంటూ పార్టీ పెద్దలు చెప్పడంతో, శివకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అత్యున్నత పదవి రేసులో తానే ముందున్నాననే ఊహాగానాల మధ్య సిద్ధరామయ్య సోమవారం నుంచి ఢిల్లీలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఎప్పుడు అనౌన్స్ మెంట్ వస్తుందని అడగ్గా.. వెయిట్ అండ్ సీ.. తెలీదు అని చెప్పారు. ముఖ్యమంత్రి పీఠం ఇవ్వకపోయినప్పటికీ తాను పార్టీకి విధేయుడిగానే ఉంటానని డీకే తేల్చి చెప్పారు. తిరుగుబాటు చేసే ఉద్దేశం లేదన్నారు. పార్టీ కావాలనుకుంటే బాధ్యత అప్పగిస్తుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టను. బాధ్యతగల మనిషిని.. వెన్నుపోటు పొడవను, బ్లాక్‌మెయిల్ అసలే చేయనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి పంపిన పరిశీలకుల బృందం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ నాయకత్వానికి తెలియజేసింది. ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్ని అందిస్తోందని కాంగ్రెస్ హైకమాండ్ దీమాతో ఉంది.

మాస్ అప్పీల్ ఉన్న నాయకుడిగా, 2018 వరకు సీఎంగా పూర్తి కాలం అధికారంలో కొనసాగిన నాయకుడిగా సిద్ధరామయ్య గుర్తింపుపొందారు. ఇక డీకే శివకుమార్ తన బలమైన సంస్థాగత సామర్థ్యాలకు ప్రసిద్ది చెందారు. కష్ట సమయాల్లో వనరులు సమీకరించి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇద్దరినీ శాంతింపజేసేలా పార్టీ నిర్ణయం తీసుకోవాలని భావించింది. డీకే శివకుమార్ రాజకీయంగా కీలకమైన వొక్కలిగ కులంలో గుర్తింపు పొందిన నాయకుడు. సిద్ధరామయ్య విషయానికొస్తే, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల భాగం, అహిండా వేదిక. కాంగ్రెస్‌కు మూకుమ్మడిగా ఓటు వేసిన మైనారిటీలు, ఇతర వెనుకబడిన తరగతులు, దళితుల పాత సామాజిక కలయిక అది. మరోవైపు రాజకీయంగా కీలకమైన లింగాయత్ సామాజికవర్గం ముఖ్యమంత్రి పదవిపై కన్నేసింది. లింగాయత్ సంస్థ ఆల్ ఇండియా వీరశైవ మహాసభ ఖర్గేకు రాసిన లేఖలో కాంగ్రెస్ పోటీ చేసిన 46 మంది లింగాయత్ నాయకులలో 34 మంది గెలిచారని పేర్కొంది. 224 సభ్యుల అసెంబ్లీలో 135 స్థానాలతో పూర్తి చేసిన కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని సాధించింది.