అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్
తెలంగాణ ఒక భౌగోళిక రాష్ట్రం మాత్రమే కాదు.. మనందరి భావోద్వేగమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.విధ్వంసకర ధోరణిని తిరస్కరిస్తూ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. సభకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హజరు కాలేదన్న రేవంత్, 80వేల పుస్తకాలు చదివిన మేధావిని అని ఆయన పదే పదే చెప్పుకుంటారని… ఆ మేధస్సును 4కోట్ల ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తారనుకున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామన్న రేవంత్… ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండటం సమాజానికి మంచిది కాదన్నారు. భవిష్యత్ లోనైనా ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరు కావాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా టీఎస్ ను టీజీగా మారిస్తే ఆయన అభినందిస్తారనుకున్నామన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయన్న రేవంత్… ప్రజాస్వామ్య భావన రావాలని ఆ చిహ్నాన్ని మార్చుతున్నామన్నారు. ఆ నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతిస్తాయనికున్నామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయంలోనూ ప్రతిపక్షం కలిసి వస్తుందనుకున్నాం.. కానీ మాకు నిరాశే మిగిలిందన్నారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని గత పాలకులు వినపడకుండా చేశారన్నారు.

జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తే ప్రతిపక్ష నేతలు అభినందిస్తారని ఆశించిన తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేం ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్న రేవంత్… మంచి పనిని అభినందించకపోగా.. బీఆరెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి 2018 వరకు బీఆరేస్ ఒక్క ఆడబిడ్డకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఎవరూ ప్రశ్నించలేదన్నారు రేవంత్… ఉద్యోగ నియామకాలు అంటే మీలా సంతలో సరుకుల్లా అమ్ముకోవడం కాదన్నారు. మేం మీలా కాదు.. మేం ఒక విధానంతో ముందుకెళతామన్న రేవంత్, వైద్య ఆరోగ్య శాఖలో 6,954 నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించామన్నారు. సింగరేణిలో 4వందలకు పైగా నియామకాలు చేపట్టి చిత్తశుద్ధి చాటుకున్నామన్నారు. విపక్ష నేతలు చొక్కాలు చించుకున్నా.. త్వరలోనే 15వేల పోలీస్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వంలో మైనారిటీలకు సముచిత స్థానం కల్పించామన్నారు. మైనారిటీల హక్కులు, వాటాలను, కోటాలను కాపాడటంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు.యూనివర్సిటీలలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. గడీల పాలన ఆనవాళ్లను బద్దలు కొట్టాలనే డిసెంబర్ 9 బదులు డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసానన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ముళ్ల కంచెలను తొలగించామన్నారు. ఆ భవనానికి బడుగుల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే పేరు పెట్టామన్నారు.

నియోజకవర్గ సమస్యలపై బీఆరెస్ ఎమ్మెల్యేలు నన్ను కలిసేందుకు వస్తే వారిని అనుమానించి అవమానిస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచుకోవాల్సిన పతిస్థితి వాళ్లకు తెచ్చారన్నారు. మీరు వారిని అనుమానించకండి… మేం మీలా కాదన్నారు రేవంత్. ఇప్పటికే 80శాతం పెన్షన్లను అందించాం… మరో 15 రోజుల్లో మిగతా 20శాతం ఇచ్చి పెన్షనర్లను ఆదుకుంటామన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆరెస్ పాలనలో కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ ప్రశ్నించారు. కాళోజీ కళా క్షేత్రాన్ని పూర్తి చేసి వారి గౌరవాన్ని కాపాడుతామన్నారు. రూ.97,500 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంతో 90వేల ఎకరాలు కూడా నీళ్లు అందలేదన్నది వాస్తవం కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. కృష్ణా ప్రాజెక్టులను మేం కేంద్రానికి అప్పగించామని ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాయన్న రేవంత్… పునర్విభజన చట్టంలో అభ్యంతరం పెట్టకుండా వారి సూచనతోనే చట్టం చేసినట్లు కేసీఆర్ చెప్పుకున్నారని, అందులో లోపాలకు బాధ్యత కేసీఆర్ దేనన్నారు. తెలంగాణ హక్కులను కాపాడేందుకు మేం కొట్లాడుతుంటే.. మా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆరెస్ ధర్నాలు చేయాల్సింది నల్లగొండలో కాదు…ప్రాజెక్టులు గుంజుకుంటానన్న మోదీ దగ్గరని మండిపడ్డారు. చేతనైతే జంతర్ మంతర్ లో కేసీఆర్, హరీష్, కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని ఆనాడు కేసీఆర్ హామీ ఇచ్చాడని… పులుసు తిని అలుసు ఇచ్చిండ్రు కాబట్టే నాగార్జున సాగర్ పై ఏపీ పోలీసులు పహారా కాసే పరిస్థితి వచ్చిందన్నారు.

హరీష్ రావును సూటిగా అడుగుతున్నా.. జగన్ పంపిన పోలీసులు నాగార్జున సాగర్ పై తుపాకులతో కవాతు చేస్తుంటే ఆనాడు అడ్డుకోవాల్సింది ఎవరని రేవంత్ ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేయకుండా నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది బీఆరెసేనన్నారు. కృష్ణా నది జలాలను ఏపీకి ధారాదత్తం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ జల హక్కులను ధారాదత్తం చేసి మరణశాసనం రాసింది బీఆరెస్ కాదా? అని రేవంత్ మండిపడ్డారు. తొమ్మిదినరేళ్లలో తన గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చాలన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరిక కూడా తీర్చలేకపోయారన్నారు. డిసెంబర్ 7న అధికారం చేపట్టిన మరుక్షణం జీవో 405 తో ఆ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చామన్నారు. ఇంద్రవెల్లి పోరాట యోధులకు నివాళిగా స్మృతి వనం అభివృద్ధి చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. అమరుల కుటుంబాలను వెతికి వెతికి వారికి ఆలంబనగా నిలిచిన ఘనత మాదన్నారు. తెలంగాణ ప్రజలను చైతన్యపరిచిన గూడ అంజన్నను పరామర్శించేందుకు కూడా ఆనాటి సీఎం రాజసౌధం నుంచి బయటకు రాలేకపోయారన్నారు. మీరు చరిత్ర పుటల్లో లేకుండా చేయాలనుకున్న గద్దర్ పేరుతోనే కళాకారులకు అవార్డులు అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రజల మేలు కోసం ప్రతిపక్షం పనిచేయాలన్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించి రాజకీయ కుయుక్తులు వేస్తామని మీరు అనుకుంటే అదీ చూద్దామన్నారు రేవంత్. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరి సహకారం ఉంటుందని భావిస్తున్నానంటూ రేవంత్ ప్రసంగం ముగించారు.

