కేంద్రమంత్రితో సీఎం భేటీ
కేంద్ర టెలికం, కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్‌వర్క్ కల్పించడం టీ ఫైబర్ లక్ష్యమన్నారు. టీ-ఫైబర్ యొక్క ప్రధాన ఉద్ధేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందిస్తామని సీఎం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించడం ముఖ్యమైన లక్ష్యం.

టీ-ఫైబర్ అమలుకు గానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి పంపించిన డీపీఆర్ ను ఆమోదించాలని కేంద్ర మంత్రి సింధియాను రేవంత్ రెడ్డి కోరారు. టీ-ఫైబర్ కు రూ. 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలన్నారు.