News

శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్ధాపనలు

రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ

గంగమ్మతల్లికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు

ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నాన‌ని, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే త‌న త‌ప‌న అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు మీరే తోడుగా నిలవండి. మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలండి అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పిలుపునిచ్చారు. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకుంటున్నానన్నారు జగన్. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేద‌ని సీఎం వైయ‌స్ జగన్‌ అన్నారు. ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని సీఎం చెప్పారు. రాష్ట్రంలో పెత్తందార్లు, పేదల పక్షాన నిలబడిన నాకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారని… వాళ్లలా అబద్ధాలు చెప్పే అలవాటు తనకు లేద‌న్నారు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణం, నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎంవైయ‌స్ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ సహా హిర మండలం వంశధార లిప్ట్‌ లిరిగేషన్‌ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ మాట్లాడారు. మూలపేట పోర్టు భూమిపూజ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిదులు ఘనస్వాగతం పలికారు. ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ప్రాజెక్టు ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేశారు.