Telangana

మునుగోడుపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్

మునుగోడు ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అన్ని ప్రధాన పార్టీ అభ్యర్థులంతా గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికను ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మునుగోడు గడ్డపై ఎలాగైనా గెలిచి తీరాలన్ని విశ్వప్రయాత్నాలు చేస్తోంది . దుబ్బాక, హుజురాబాద్ తరహా ఫలితాలు పునరావృతం కావద్దని.. ఒకవేళ అలా జరిగితే.. పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులను మునుగోడులో దించారు సీఎం కేసీఆర్. మునుగోడు నియోజకవర్గాన్ని మొత్తం 86 క్లస్టర్లుగా విభజించి వాటికి ఇంచార్జులను నియమించారు. 14 మంది మంత్రులతో పాటు 72 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఎంపీటీసీ పరిధికి ఒక్కో ఎమ్మెల్యేను ఇంచార్జ్‌గా ఉన్నారు. సీఎం కేసీఆర్ కూడా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి ఇంచార్జిగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఒక చిన్న గ్రామంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను తీసుకున్నారంటే.. ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ కూడా రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 30న చండూరు మండలం బంగారి గడ్డలో కేసీఆర్ భారీ బహిరంగ సభతో ప్రచారాన్ని ముగిస్తారని సమాచారం. ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలంతా.. ఎవరికి కేటాయించిన గ్రామాల్లోనే వారు ఉండాలని కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.