ఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ దంపతులు ఢిల్లీకి పయనమయ్యారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. కేసీఆర్ నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. రేపు, ఎల్లుండి రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈనెల 14న సర్దార్ పటేల్ మార్గంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ పరిశీలిస్తున్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ జాతీయ విధానం, జాతీయ కార్యవర్గం, కమిటీలపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారితో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున చట్ట సభల ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం ఢిల్లీ వెళ్ళనున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి.

