Andhra PradeshHome Page Slider

అసెంబ్లీలో సీఎం జగన్ ఆగ్రహం… వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై సస్పెన్షన్ వేటు

ఏపీ అసెంబ్లీలో ఇవాళ అనూహ్య ఘట్టాలు నమోదవుతున్నాయ్. గవర్నర్‌ను అవమానించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నిమ్మల కిష్టప్పను ప్రభుత్వం సస్పెండ్ చేయగా.. తాజాగా వైసీపీ రెబల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేపై స్పీకర్ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. టీడీపీ సభ్యులతో కలిసి.. సభను జరక్కుండా అడ్డుకుంటున్నారని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఎవరి ప్రణాళికలో కోటంరెడ్డి భాగమయ్యారో అర్థమవుతుందన్నారు.

ఇక మరో మంత్రి జోగి రమేష్ సైతం, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అంటూ దుయ్యబట్టారు. తల్లిపాలు తాగి.. తల్లి రొమ్ము గుద్దే ఒక దుర్మార్గపు వ్యక్తి అంటూ విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచారని… ఫ్యాన్ గుర్తు, జగన్‌ను చూసి గెలిచి.. ఇవాళ టీడీపీ అడుగులకు మడుగులొత్తుతున్నారంటూ విమర్శించారు.

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ పొగిడితే కోటంరెడ్డి సహించలేకపోతున్నాడంటూ విమర్శించారు శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇవాళ జరిగే చర్చను జరక్కుండా చేయాలని కోటంరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు బుగ్గన. ఇక అదే సమయంలో సభలో కూర్చున్న సీఎం జగన్.. కోటంరెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తున్నారంటూ వెనుకన ఉన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి సైగలు చేశారు. సీఎం ఆదేశాలతో పరుగుపరుగున శ్రీకాంత్ రెడ్డి ముందుకు కదిలారు.