మంత్రి రోజాకు సీఎం జగన్ క్రికెట్ పాఠాలు
‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని నేడు జెండా ఊపి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జగన్‌కు ఇష్టమైన క్రికెట్‌ను ఆడుతూ, మంత్రి రోజాను ఆహ్వానించారు. బ్యాట్ ఇచ్చి స్వయంగా క్రికెట్ పాఠాలు నేర్పారు. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ చేయగా, ముఖ్యమంత్రి జగన్ బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా వికెట్ కీపింగ్ చేశారు. నేటి నుండి 47 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం జరగబోతోంది. నేడు ముఖ్యమంత్రి జగన్, గుంటూరు నల్లపాడులో ఈపోటీలను ప్రారంభించారు. ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదని, మొదటిసారిగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో ఉన్న టాలెంట్‌ను ఈపోటీల ద్వారా గుర్తిస్తామని, మేటి ఆటగాళ్లను దేశానికి అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ వాగ్దానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల వార్డు, సచివాలయ స్థాయిలో పోటీలు జరుగుతాయని నిర్వహకులు పేర్కొన్నారు. 5 దశల్లో ఈ పోటీలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.22 కోట్లమంది క్రీడాకారులను రిజిష్టర్ చేసినట్లు తెలిపారు. 5 లక్షల స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, విడుదల రజని సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

