సింగపూర్ లో సీఎం బిజీ బిజీ
చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే ఆ మాత్రం ఉండాలే… అస్సలు తగ్గేదేలే అన్నట్లుండాలే అని అంతా అనుకునేట్లుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.రూలింగ్‌లో రైజింగ్‌లో తాను చంద్రబాబుకి ఏమాత్రం తీసి పోను అని నిరూపిస్తున్నారు.సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా సింగపూర్‌లో పర్యటించి పలు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి సింగపూర్‌లో పర్యటించిన రేవంత్ రెడ్డి… అక్కడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE Singapore)ను సందర్శించారు. సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20 కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును పరిశీలించారు. తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చిన సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజీతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించి ఈ మేరకు శిక్షణ ఇవ్వనుంది.