వాలంటీర్లకు ధర్మాన ఓట్ల పాఠాలు
ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీ మంత్రి బంపర్ స్కెచ్
ఏ,బీ,సీ కేటగిరిగా ఓటర్ల విభజన
వాలంటీర్లకు కీలక సూచనలు చేసిన మంత్రి
ఇష్టం లేకుంటే ఉద్యోగం వదిలేయాలన్న మంత్రి తనయుడు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ఎంత ప్రతిష్టాత్మకమో, పార్టీల నేతలు మాట్లాడుతున్నదాన్ని బట్టి అర్థమవుతోంది. తాజాగా ఏపీ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్ ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగించేలా ఉన్నాయి. శ్రీకాకుళంలో వాలంటీర్లతో జరిగిన సమావేశంలో మంత్రి ఓటును వేయించడానికి మూడు రకాల విశ్లేషణలు చేశారు. ఓటర్లను ఏ,బీ,సీగా వర్గీకరించి.. ఏ కేటగిరిలో వైసీపీకి, బీ కేటగిరిలో టీడీపీకి, సీ కేటగిరిలో గోడమీద పిల్లిలాంటి వారు ఎవరో నిర్ధారించుకోవాలని చెప్పారు.

టీడీపీకి ఓటు వేసే కుటుంబంలో ఒక్కో కుటుంబాన్ని వాలంటీర్లు వైసీపీ వైపు మళ్లించగలిగితే… వేలల్లో ఓట్లు వస్తాయని చెప్పుకొచ్చారు ధర్మాన. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే పథకాలు ఉండవని, జగన్ గెలిస్తేనే మళ్లీ పథకాలు అమలవుతాయన్నది గట్టిగా చెప్పగలగాలన్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయిన వైసీపీ ఓటర్ల వివరాలను సేకరించాలన్నారు. కొందరు మాట వినకుంటే కుల పెద్దలతో మాట్లాడాలన్నారు. ఓట్ల సేకరణ విషయంలో తుపాకీ పట్టిన జవాన్‌లా పనిచేయాలన్నారు.

వైసీపీ ఓడిపోతే వాలంటీర్ ఉద్యోగాలు ఉండవన్నారు. ఇక ధర్మాన తనయుడు రామ్ మనోహార్ నాయుడు మాట్లాడుతూ ప్రజలు నాయకులను మరచిపోయారని.. వాలంటీర్లనే గుర్తుపెట్టుకున్నారన్నారు. అందరూ ఎన్నికలకు సిద్ధమవ్వాలన్నారు. వైసీపీ కోసం పనిచేయాల్సి ఉంటుందన్న ఆయన, ఇష్టం లేని వారు ఉద్యోగం మానేయాలన్నారు.