అనకాపల్లిలో కూటమి పార్టీల మధ్య రచ్చ
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో అధికార కూటమి పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ స్థలంలో చెట్ల నరికివేతపై మొదలైన వివాదం కాస్తా, పరస్పర దాడులకు దారితీసింది. ఎమ్మార్వో సమక్షంలోనే ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో పెదమదిన గ్రామం రణరంగంగా మారింది.
పెదమదిన గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో ఉన్న చెట్లను టీడీపీ వర్గీయులు నరికివేయడంతో గొడవ మొదలైంది. ప్రభుత్వ ఆస్తిని ఎలా ధ్వంసం చేస్తారని జనసేన కార్యకర్తలు దీనిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బుచ్చయ్యపేట ఎమ్మార్వో నేతృత్వంలో అధికారులు మంగళవారం గ్రామసభను ఏర్పాటు చేశారు.
గ్రామసభ జరుగుతుండగానే ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన కార్యకర్తలు ఒక్కసారిగా కర్రలు,రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. అధికారుల ముందే ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది.ఈ దాడిలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తల తలలు పగిలాయి.గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు భారీగా రంగంలోకి దిగారు. లాఠీచార్జ్ చేసి రెండు వర్గాలను అక్కడి నుంచి చెల్లాచెదురు చేశారు. ప్రస్తుతం గ్రామంలో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆధిపత్యం కోసం రెండు పార్టీల నేతలు ఇలా వీధికెక్కి కొట్టుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

