Home Page SliderNational

కర్నాటక జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలకు సీజేఐ చీవాట్లు

నాలుగు గోడల మధ్య మాట్లాడిన విషయాలు పెద్దగా ప్రచారంలోకి రావు. కానీ అందరి ముందు, బహిర్గతంగా మాట్లాడిన మాటలు ప్రపంచం మొత్తానికి తెలుస్తాయి. కొందరు వ్యాఖ్యలు చేసేటప్పుడు తామేం మాట్లాడుతున్నామన్నది అసలు పట్టించుకోరు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతూ ఆ వ్యక్తుల నిజ స్వరూపాన్ని బయటపడేస్తుంటాయి. కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఈరోజు కర్ణాటక హైకోర్టును నివేదిక కోరింది. భూస్వామి-కౌలుదారు వివాదాన్ని ప్రస్తావిస్తూ, జస్టిస్ శ్రీశానంద, బెంగళూరులోని ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాన్ని “పాకిస్తాన్” అని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక మరో విషయంలోనూ సీజేఐ బెంచ్ మండిపడింది.

ఒక మహిళా న్యాయవాదిపై స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు ఎస్ ఖన్నా, బీఆర్ గవాయ్, ఎస్ కాంత్, హెచ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం కర్నాటక హైకోర్టులో, జడ్జి చేసిన వ్యాఖ్యలపై స్పష్టమైన మార్గదర్శకాలుండాల్సిందేనని స్పష్టం చేశారు. కోర్టులో వస్తున్న తీర్పులపై వ్యాఖ్యానాలు విస్తృతం కావడంతో సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానాలు కామెంట్స్ చేసే సమయంలో జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

“కోర్టు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై మీడియా కామెంట్స్‌పైనా సీజేఐ వ్యాఖ్యానించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుండి సూచనలను కోరిన తర్వాత నివేదికను సమర్పించాలని కర్ణాటక హైకోర్టును అభ్యర్థిస్తున్నాం” అంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. రెండు రోజుల్లో నివేదికను దాఖలు చేసి సమర్పించాలని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. ఈ అంశంపై విచారణ వచ్చేవారం బుధవారం జరగనుంది. జస్టిస్ శ్రీశానానంద వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక వీడియోలో, బెంగుళూరులోని ముస్లిం ఆధిపత్య ప్రాంతాన్ని “పాకిస్తాన్” అని పేర్కొన్నారు. మరొక వీడియోలో ఒక మహిళా న్యాయవాదిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. రెండో సంఘటనలో, జస్టిస్ శ్రీశానానంద మహిళా న్యాయవాదికి “ప్రతిపక్ష పార్టీ” గురించి చాలా తెలుసునని… వారి లోదుస్తుల రంగు కూడా తెలుసంటూ కామెంట్ చేయడంతో దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.