అమరావతి పిటిషన్లను మరో ధర్మాసనానికి పంపాలని సీజేఐ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అంశంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రాజధాని ప్రాంత రైతులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు (సీజేఐ) జస్టిస్ యు.యు.లలిత్ విముఖత చూపారు. ఈ పిటిషన్లను తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని జస్టిస్ యు.యు.లలిత్ ఆదేశించారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని ఏపీ ప్రభుత్వం సవాలు చేస్తూ గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. ఈ కేసులో తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ అమరావతి రైతులు కోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు 2 వేల పేజీలతో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అమరావతే రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని ఆ పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. రాజధాని అంశంలో ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ ప్రభుత్వం ఆ పిటిషన్‌లో ప్రస్తావించింది.