Home Page SliderTelangana

చైతన్య ఇంటర్ విద్యార్థి బలవన్మరణం-ప్రిన్సిపల్, వార్డెన్ అరెస్టు

హైదరాబాద్ శివారు ప్రాంతంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్య కళాశాలలో ఒక విషాద ఘటన జరిగింది. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి మంగళవారం రాత్రి స్టడీ అవర్ ముగిసాక క్లాస్ రూమ్‌లోనే ఉరి వేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల యాజమాన్యం చేసిన వేధింపులు, ఒత్తిళ్ల వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. తన బిడ్డ చాలా సెన్సిటివ్ అని, ఎవరైనా నొప్పించే మాటలంటే తట్టుకోలేడని, తల్లి విలపించింది. చాలా బాగా చదివేవాడని, మార్కులు బాగా వచ్చేవని పేర్కొన్నారు. ఈ మధ్యనే శివరాత్రికి ఇంటికి వచ్చి రెండురోజులు గడిపాడని తలచుకొని తీవ్రంగా బాధ పడ్డారు. ముందు రోజు రాత్రే హాస్టల్‌లో సాత్విక్‌ను కలిసామని, చాలా విచారంగా కనిపించాడని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సంవత్సరం ఎలాగోలా గడిపేయమని, సెకండ్ ఇయర్‌లో కాలేజ్ మార్చేస్తామని చెప్పామన్నారు. కానీ ఇంతలోనే ఇంత అఘాయిత్యం చేస్తాడనుకోలేదని కన్నీరు మున్నీరయ్యారు.

కళాశాల విద్యార్థులు వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య కళాశాల విద్యార్థులను తరచూ కొట్టేవాడని, కడుపులో పిడిగుద్దులు గుద్దేవాడని పేర్కొన్నారు. వారు దీనికి సాక్ష్యంగా అతని వీడియోను కూడా చూపించారు. ఈ ఘటనలో వైస్ ప్రిన్సిపాల్ ఆచార్యను, వార్డెన్ నరేష్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. కళాశాల యాజమాన్యంపై కూడా సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. తెలంగాణా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్‌ను ఈ ఘటనపై విచారించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.