మనవడి కోసం చిరంజీవి ఆరాటం..
తన కుమారుడు రామ్ చరణ్‌కు కొడుకు పుడితే చూడాలని ఉందని మెగా స్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇల్లంతా మనవరాళ్లతో లేడీస్ హాస్టల్‌లా మారిపోయిందని, అందుకే తనకు మనవడు ఉంటే బాగుంటుందనిపిస్తోందని ఇటీవల జరిగిన బ్రహ్మా ఆనందం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సరదాగా వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవడుగా నటించారు. ఈ సందర్భంలో చిరంజీవి ఇలా మాట్లాడారు. రామ్ చరణ్‌కు కొడుకు పుట్టి తన వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. అందుకే ‘చరణ్ ఈసారి అబ్బాయిని కనురా..’ అని అడుగుతూంటానని పేర్కొన్నారు. మళ్లీ అమ్మాయి పుడుతుందేమో అని భయం వేస్తోందన్నారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో భారత దేశ ప్రతిష్టాత్మక అవార్డు పద్మవిభూషణ్ గ్రహీత చిరంజీవి ఇలా మాట్లాడడం సరికాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ కాలంలో కూడా లింగ వివక్ష ఏంటని నిలదీస్తున్నారు. మెగాస్టార్ అంతటి వ్యక్తి ఇలా మాట్లాడకూడదని హితవు చెప్తున్నారు.

