ఘట్ కేసరిలో కిడ్నాపైన చిన్నారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో లభ్యం
ఘట్ కేసరిలో బుధవారం కిడ్నాపైన నాలుగేళ్ల చిన్నారి కథ సుఖాంతమయ్యింది. ఘట్ కేసరిలో నాలుగేళ్ల పాప సాయంత్రం ఇంటి పక్కనే ఉన్న కిరాణాషాప్‌కు వెళ్లి కిడ్నాప్‌కు గురయ్యింది. తల్లిదండ్రులు వెంటనే కంప్లైంటు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ,సీసీ టీవీ ఫుటేజ్‌లలో గాలించారు. ఒక దానిలో నిందితుడు సురేష్ పాపను ఎత్తుకుని వెళ్తుండగా చూసి, బస్టాండులు, రైల్వే స్టేషన్లలో తనిఖీని ముమ్మరం చేశారు. ఘట్ కేసరిలోని ఈ కాలనీలో బస్తీ వాసులు, స్కూలు పిల్లలు అందరూ రాత్రంతా పాప కోసం గాలించారని సమాచారం. చివరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సురేష్‌ను, బాలికను గమనించారు. సురేష్‌ను అదుపులోకి తీసుకుని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. దీనితో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సురేష్ మానసిక పరిస్థితి సరిగా లేదని, సైకోగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు తెలిపారు. పాపను ఎందుకు కిడ్నాప్ చేశాడు, ఎక్కడికి తీసుకెళ్లలనుకున్నాడు అనే విషయాలు పోలీసులు విచారిస్తున్నారు.

