పురుష బౌద్ధసన్యాసి వేషంలో చైనా మహిళ గూఢచర్యం
దేశంలో దొంగ సన్యాసులు ఎక్కువయిపోయారు. నిత్యం మనమధ్య సన్యాసి వేషాలలో తిరిగే వారే ఖిలాడీలు కావచ్చు. దేశ ద్రోహులు కూడా అయ్యిండొచ్చు. ఇలాగే బౌద్ధ పురుషసన్యాసి వేషంలో చైనా మహిళను కనిపెట్టారు పోలీసులు. ఢిల్లీలో ఈ చైనా మహిళ గూఢచర్యం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె బౌద్దసన్యాసి వేషంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమెకు ఇంగ్లీష్, నేపాలీ, మాండరీన్ భాషలు తెలుసు.

ఆమె చైనా పాస్‌పోర్టు వాడి 2019లో భారతదేశంలోకి అడుగుపెట్టింది. ఆ పాస్‌పోర్టులో ఆమె పేరు ‘కాయ్‌రో’ అనే పేరుతో ఉంది. ఫారెనర్స్ రీజినల్ రిజిస్టార్ ఆఫీస్ ప్రకారం ఆమె పేరు ‘కాయ్ రో’. ఇప్పుడు ఆమె ‘డోల్‌మా లామా’ అనే పేరుతో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉత్తరక్యాంపస్ సమీపంలోని మజ్ఞుకాటిల్లా అనే ప్రదేశంలో టిబెట్ శరణార్థులు నివసించే ప్రాంతంలో మూడేళ్లుగా మారువేషంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను విచారించగా తనకు చైనాలోని కమ్యూనిష్టు పార్టీ నేతలనుంచి ప్రాణహాని ఉన్నట్లు చెపుతోంది. ఆమె రికార్టులు, సామాగ్రి తనిఖీ చేయగా చాలా అనుమానించదగిన విషయాలు బయటపడ్డాయి. ఆమె వద్ద కాఠ్మాండూకి చెందిన చిరునామా లభించింది. ఎరుపు రంగు దుస్తులు ధరించి, పురుష బౌద్ధ సన్యాసి వేషంలో గుండు చేసుకుని ఉంది. ఈమె చైనాకోసం రహస్య కార్యకలాపాలు జరుపుతున్నట్లు అంచనావేస్తున్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా చేసిందా అనే కోణంలో విచారిస్తున్నారు.