Breaking NewsNewsTelangana

పసి ప్రాణం తీసిన చైనా మాంజా

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో చైనా మాంజా ఒక పసి ప్రాణాన్ని బలిగొంది. వివేకానంద నగర్ కాలనీలో తండ్రితో కలిసి బైక్ వెళ్తున్న ఒక చిన్నారి మెడకు గాలిలో ఎగురుతున్న చైనా మాంజా చుట్టుకోవడంతో ఈ ఘోరం జరిగింది. బైక్ వేగంగా వెళ్తుండటంతో మాంజా చిన్నారి గొంతులోకి లోతుగా దిగబడటంతో తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన తండ్రి వెంటనే పాపను స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే పరిస్థితి విషమించడంతో చిన్నారి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారి బైక్ ముందు భాగంలో కూర్చుని ఉన్నట్లు సమాచారం. గాలిపటాలను ఎగురవేసేందుకు వాడే నిషేధిత చైనా మాంజా గొంతుకు కోసుకుపోవడంతో సెకన్ల వ్యవధిలోనే చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ హృదయ విదారక ఘటనతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆసుపత్రి వద్ద చిన్నారి తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. నిషేధిత చైనా మాంజా వాడకంపై అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, విచ్చలవిడిగా విక్రయించడం వల్లే ఈ అనర్థం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.