భారత గగనతలంలో చైనా బెలూన్ డిటెక్టివ్
చైనా వాయుసేన అధ్వర్యంలో ప్రయోగింపబడిన నిఘా బెలూన్లు అమెరికా రక్షణ దళం కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే. అమెరికా అధికారులు నిర్ధారించిన ప్రకారం చైనా ఈ బెలూన్లను వాడి భారత్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తోంది. కొన్ని దేశాలపై చైనా నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. దీనికోసం చైనా పురాతన పద్ధతులకు అత్యాధునిక సాంకేతికను కూడా మేళవించి నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హెయినన్ ప్రావిన్స్ కేంద్రంగా చైనా దక్షిణ తీరంలో ఈ బెలూన్లను ఎగురవేస్తూ భారత్, జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం మొదలైన దేశాలలో సైన్యం, ఆయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎలా మోహరిస్తున్నాయో తెలుసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు ఖండాల్లో ఇటువంటి బెలూన్లు కనిపించినట్లు వాషింగ్టన్ పోస్టు తెలియజేసింది. ఈ చైనా బెలూన్ వ్యవహారాలపై 40 దౌత్యకార్యాలయాలకు చెందిన 150 మందికి సమాచారం అందింది. దీనిని అమెరికా డిప్యూటీ విదేశాంగ మంత్రి వెండీ షెర్మన్ తెలియజేశారు. అమెరికా మిత్రదేశాలకు కూడా హెచ్చరికలు పంపించారు.

ఈ చైనా బెలూన్ 200 అడుగుల ఎత్తుతో కొన్ని టన్నుల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ బెలూనును సముద్రంలో కూల్చివేసింది అమెరికా. దానినుండి శకలాలను సేకరించి, వాటిని విశ్లేషించే పనిలో ఉంది. ఆ బెలూన్‌కు ఉండే సాంకేతిక సామర్థ్యం, అది ఏదైనా ఉపగ్రహంతో అనుసంధానమైనదా, ఇంకేవైనా సున్నిత పరికరాలు ఉన్నాయా అనే విషయాలు పరిశీలిస్తున్నారు. బెలూన్ నిర్మాణానికి ఉపయోగించిన పరికరాలు తిరిగి నిర్మించి బెలూన్ పనితీరు కనిపెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని అత్యున్నత నిపుణులు పనిచేసే FBI ఆపరేషనల్ టెక్నాలజీ డివిజన్ బృందం శకలాలను విశ్లేషించనున్నారు. ఈ శకలాలు 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో పడ్డాయి. వీటిని జాగ్రత్తగా నౌకాదళం సేకరిస్తోంది. బెలూన్ కూల్చివేత తర్వాత చైనాతో కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నించామని, చైనా స్పందించలేదని అమెరికా తెలియజేసింది.

