చిన్నారి మెడకు చైనామాంజా
సంక్రాంతి సందర్భంగా ఎగురవేసే గాలిపటాలకు కట్టే చైనామాంజా ఓ చిన్నారి గొంతు కోసింది. వనస్థలిపురంలోని కమలానగర్‌లో ఉండే వినయ్‌కుమార్, స్నేహలతల కుమార్తె ఐదున్నరేళ్ల కీర్తి. శుక్రవారం సాయంత్రం తన భార్యను ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో పికప్ చేసుకునే ఉద్దేశంతో వినయ్ కుమార్ కీర్తితో కలిసి బైకుపై వెళ్లారు. వారు నాగోలు వంతెనపై నుండి ప్రయాణిస్తుండగా పైన ఎగురుతున్న గాలిపటానికి ఉన్న చైనామాంజా పక్కనున్న కరెంటు స్తంభానికి చిక్కుకుని, బైకు ముందు కూర్చున్న చిన్నారి మెడ కోసుకుపోయింది. చాలా లోతైన గాయం చేసింది. చాలా రక్తస్రావం జరగడంతో వెంటనే దగ్గరలోని సుప్రజ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రధమచికిత్స చేయించారు. అనంతరం చింతల కుంట రెయిన్‌బో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కీర్తికే కాక వినయ్ కుమార్‌కు కూడా ముక్కు కోసుకుపోయింది.

చిన్నారికి శనివారం శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. తండ్రి చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తును ప్రారంభించారు. గాలిపటాల సరదాతో చైనా మాంజాలు కొనుగోళ్లు చేయెద్దని ప్రభుత్వం ఎన్ని విన్నపాలు చేసినా కొనేవాళ్లు, ఆడేవాళ్లు దానిని మానుకోవడం లేదు. ఆకాశంలో యధేచ్ఛగా ఎగిరే ఎన్నో పక్షులకు కూడా ఇవి ప్రాణాంతకంగా మారుతున్నాయి. గాలిపటాలపై కఠిన ఆంక్షలు, శిక్షలు విధిస్తే గానీ పరిస్థితులు చక్కబడవని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.

