గ్రానైట్ దందాలో చైనా హవాలా..! ఈడీ సోదాల్లో బట్టబయలు..
హైదరాబాద్, నవబంరు 12(మనసర్కార్): గ్రానైట్ కంపెనీల్లో ఈడీ జరిపిన సోదాల్లో కొత్త విషయాలు బయటపడ్డాయి. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు చెందిన కంపెనీలతోపాటు హైదరాబాద్, కరీంనగర్‌లోని సంస్థలు ఫెమా (విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనలను అతిక్రమించినట్లు ఈడీ తేల్చింది. ఈ సంస్థలన్నీ చైనా, హాంకాంగ్‌తో పాటు ఇతర దేశాల్లోని కంపెనీలకు చెల్లించిన రాయల్టీకి మించిన పరిమాణంలో ముడి గ్రానైట్‌ను ఎగుమతి చేసినట్లు పూర్తి ఆధారాలతో ఈడీ నిర్ధారించింది. లెక్కల్లోకి రాని డబ్బును ఆ దేశాల నుంచి హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించింది. ఇక చైనాకు చెందిన లీవెన్ హ్యూ అనే వ్యాపారి ఖాతా నుంచి గ్రానైట్ సంస్థల యజమానుల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు జమ అయినట్లు కూడా అధికారులు గుర్తించారు. అంతర్జాతీయంగా పన్ను ఎగవేతదారుల వివరాలతో పనామా లీక్స్ విడుదల చేసిన జాబితాలో లివెన్ హ్యూ పేరు ఉండటం విశేషం.

బినామీ ఖాతాల్లోకి నగదు బదిలీ..
బుధ, గురు వారాల్లో జరిపిన వరుస సోదాలపై ఈడీ వర్గాలు శుక్రవారం ఓ అధికార ప్రకటన విడుదల చేశాయి. శ్వేతా గ్రానైట్స్, శ్వేతా ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎస్‌ఆర్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు ఆయా సంస్థలకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్‌లో రెండు రోజుల పాటు ఈడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా గ్రానైట్ కంపెనీల్లో పనిచేసే వారి బినామీ ఖాతాల్లోకి చైనా, హాంకాంగ్ నుంచి పెద్ద మొత్తంలో నగదు వచ్చి చేరినట్లు తేల్చారు. చైనా, హాంకాంగ్‌తో పాటు ఇతర దేశాల నుంచి ఆయా ఖాతాల్లోకి వచ్చిన నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకుండానే చే బదులు రూపంలో తీసుకున్నట్లు చెబుతున్నారని, అది సరైంది కాదని ఈడీ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజులపాటు హైదరాబాద్, కరీంనగర్‌లోని వేర్వేరు గ్రానైట్ సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో లెక్కల్లోలేని రూ.1.08 కోట్ల నగదుతో పాటు గత పదేళ్లుగా గ్రానైట్ ఎగుమతులకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్ క్వారీ లీజు ప్రాంతాల్లో తీగ లాగితే..
గతంలో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీలాండరింగ్ కోణంలో ఈడీ సోదాలు నిర్వహించిందని అంతా అనుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగానే గ్రానైట్ సంస్థల్లో సోదాలు నిర్వహించామని తమ ప్రకటనలో ఈడీ అధికారులు వెల్లడించడం గమనార్హం. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29.05.2013లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అప్రైజల్ నివేదిక నంబరు 6(సి.నెం.268/ఎన్‌ఆర్/2013) ప్రకారం 7,68,889.937 క్యూబిక్ మీటర్ల ఖనిజాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసినట్లు ప్రకటనలో ఈడీ వెల్లడించింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఎగవేసిన సీనరేజ్ ఫీజు రూ.124,94,46,147. ఎగవేసిన పెనాల్టీ రూ.624,72,30,735.. రెండూ కలిపి మొత్తం రూ. 729,66,76,882గా తేల్చింది. అప్పటి విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. కరీంనగర్‌లోని క్వారీ లీజు ప్రాంతాల నుంచి సముద్ర మార్గంలో రవాణా చేసిన గ్రానైట్ బ్లాకులపై పెద్ద ఎత్తున సీనరేజ్ ఫీజు ఎగవేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ ఇచ్చిన నివేదిక మేరకు అక్రమ గ్రానైట్ మైనింగ్, ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. సముద్రం, రైలు మార్గాల్లో అక్రమంగా తరలించిన గ్రానైట్‌కు సంబంధించి రాయల్టీ చెల్లించాలని పలు మార్లు కోరినా ఎగుమతిదారులు చెల్లించలేదని ఈడీ అధికారులు తెలిపారు.

అధికార పార్టీ నాయకుల గ్రానైట్ వ్యాపారం..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార పార్టీకి చెందిన నాయకులు గ్రానైట్ వ్యాపారాల్లో ఉండటంతో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత గ్రానైట్ సంస్థలకు విధించిన జరిమానా వసూలు విషయాన్ని పట్టించుకోవడం లేదంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు ఇతర దర్యాప్తు సంస్థలకు పలువురు లేఖలు రాశారు. దీంతో ఈడీ మరోసారి గ్రానైట్ సంస్థలపై దృష్టి సారించింది.

పలువురికి నోటీసులు
హైదరాబాద్, కరీంనగర్‌లోని గ్రానైట్ సంస్థల్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. ఆయా సంస్థల యజమానులు తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఎవరెవరు ఎప్పుడెప్పుడు విచారణకు హాజరు కావాలనేది తేదీలతో కూడిన వివరాలను నోటీసులో పొందుపర్చింది. ఈడీ నోటీసులు అందుకున్న వారిలో మొట్టమొదటగా పీఎస్‌ఆర్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని పాలకుర్తి శ్రీధర్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో శుక్రవారం విచారణకు హాజరయ్యారు. పలు అంశాలపై ఆయన్ను ఈడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా పలు పత్రాలు పరిశీలించారు. అవసరమైతే మరోసారి విచారణకకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు. వచ్చే వారం నుంచి వరుసగా ఆయా గ్రానైట్ సంస్థలకు చెందిన యజమానులు ఒక్కొక్కరుగా ఈడీ అధికారుల ఎదుట పూర్తి పత్రాలతో హాజరుకానున్నారు.

