పాక్‌కు అప్పిచ్చిన డ్రాగన్
‘ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయంటారు’ పెద్దలు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు డ్రాగన్ చైనా నుండి అప్పు పుట్టింది. చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ ద్వారా ఈ వారంలో 70 కోట్ల డాలర్లు పాక్ స్టేట్ బ్యాంక్ ఖాతాలో పడనున్నాయి అని పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ బుధవారం ట్వీట్ చేశారు. ఇప్పటికే పాక్ విదేశీ మారకద్రవ్య నిధులు అడుగంటిపోతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) 1.1 బిలియన్ డాలర్ల రుణం కూడా ఇంకా మంజూరు కాలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చైనా ఇస్తున్న ఈ రుణం పాకిస్తాన్‌కు ఎంతో ఊరట కలిగిస్తోంది. అయితే చిత్రమేమిటంటే సీపెక్ పేరుతో పాక్‌ను అప్పుల్లోకి నెట్టిందే చైనా. ఇప్పుడు మళ్లీ రుణం అందించడానికి ముందుకొచ్చింది. ప్రస్తుతానికి పాక్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఇంక మూడు వారాల దిగుమతులకు సరిపడే డాలర్లు మాత్రమే ఉన్నాయి.