Home Page SliderInternationalNews

విమాన కూలిపోయిన ఘటనలో అడవిలో మృత్యుంజయులుగా నిలిచిన చిన్నారులు

అమెజాన్ అడవులలో అద్భుతం జరిగింది. నలుగురు చిన్నారులు 40 రోజులు ఒంటరిగా అడవుల్లో గడిపి, మృత్యుంజయులుగా నిలిచారు. 40 రోజుల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో ఈ పిల్లల తల్లి, విమానం పైలట్, గైడ్ చనిపోయారు. కానీ భగవంతుని లీల ఎంతో విచిత్రం. 13, 9,4 సంవత్సరాల వయస్సు గల పిల్లలను కాపాడాడు. వీరితో పాటు చిన్నారి 11 నెలల పసిబిడ్డ కూడా ఉండడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెజాన్ అటవీ ప్రాంతం వద్ద అరారాక్యూరా అనే ప్రదేశం నుండి శాన్‌జోస్ డెల్ గ్వావియారే అనే ప్రదేశానికి మే 1 వతేదీన ఒక ప్రైవేట్ విమానం బయలుదేరింది. ఈ విమానంలో ఈ నలుగురు చిన్నారులు, తల్లి, పైలట్, గైడ్ ఉన్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజన్ మొరాయించడంతో విమానం కూలిపోతోందని పైలట్ ప్రకటించాడు.

దీనితో సైన్యాన్ని పంపించారు అధికారులు. ఆపరేషన్ హోప్ అనే పేరుతో అమెజాన్‌ అడవులలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రపంచంలోనే పెద్దదైన,దట్టమైన ఆ అడవులలో మే 16న విమాన శకలాలు గుర్తించారు. పైలట్, తల్లి, గైడ్ మృతదేహాలు గుర్తించారు. కానీ పిల్లలు కనిపించలేదు. దీనితో 150 మంది సైనికులు, పోలీస్ జాగిలాల సహాయంతో బాగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి వారి ప్రయత్నం ఫలించి, నలుగురిని సజీవంగా గుర్తించారు. అయితే ఇన్ని రోజులు క్రూరమృగాలు తిరిగే అడవిలో వారు  ఎలా జీవించారో, తమను తాము ఎలా కాపాడుకున్నారో అంతుచిక్కడం లేదు.

ఏ దిక్కూ లేని వారికి దేవుడే దిక్కన్నట్లు వారిని భగవంతుడే కాపాడాడు. అప్పుడప్పుడు హెలికాఫ్టర్ల సహాయంతో ఆహార పదార్థాలు ఉన్న బాక్సులను భద్రతా సిబ్బంది అడవులలో జారవిడిచారు. అవే ఈ పిల్లల ప్రాణాలను నిలబెట్టాయని భావిస్తున్నారు. కొలంబియా ప్రభుత్వం ఈ విషయంలో ఎంతో హర్షం వ్యక్తం చేసింది. తమ ప్రయత్నాలు ఫలించాయని, అడవే వారిని రక్షించిందని, కొలంబియాకు వారసులని దేశ అధ్యక్షుడు పెట్రో చాలా సంతోషం వ్యక్తం చేశారు.