చీపురుపల్లి నాకు సర్‌ప్రైజ్… పోటీపై నిర్ణయం తీసుకోవాలన్న మాజీ మంత్రి గంటా
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. గంటా ఈసారి భీమిలి నుంచిగానీ, నెల్లిమర్ల నుంచి గానీ పోటీ చేస్తారని చర్చ జరిగినప్పటికీ తాజాగా ఆయనను చీపురుపల్లి నుంచి బరిలో దించాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే తాను గతంలో పోటీ చేసిన చోట నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నానన్నారు గంటా శ్రీనివాసరావు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ కోరిన మాట నిజమేనన్నారు గంటా. పార్టీ చెప్పిన విషయాన్ని ఆలోచిస్తున్నానన్నారు. ఇప్పటి వరకు పార్టీ అనేక నియోజకవర్గాల్లో పోటీ చేసిన మాట నిజమేనని… అలాగని మరోసారి నియోజకవర్గం మారాలని ఏమీ లేదన్నారు. తాను ఈసారి ఎక్కడ్నుంచి పోటీ చేయాలన్నదానిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.. దూకుడుగా నిర్ణయం తీసుకోలేమన్నారు.

ఇప్పటి వరకు తన రాజకీయమంతా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో, విశాఖ జిల్లాలో జరిగిందన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంపై స్టడీ చేయాల్సి ఉందన్నారు. వైజాగ్ లో ఉండటం వల్ల భీమిలి, విశాఖ నార్త్ లో పోటీ చేశానన్నారు. చీపురుపల్లి అనేది సర్‌ప్రైజ్ అన్నారు. శ్రేయోభిలాషులతోపాటు, పార్టీ నేతలతో మాట్లాడాలని చెప్పారు. పార్టీ ఆలోచనలపై త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. పార్టీ అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీ నిర్ణయం కరెక్టా కాదా అన్నది తేలాలన్నారు. నారా భువనేశ్వరి సరదాగా మాట్లాడితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నానన్నారు. చంద్రబాబుకు రెస్టివ్వాలని భువనేశ్వరే చెబుతున్నారని రోజా చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు హామీలివ్వడం దగా, మోసం అని జగన్ గతంలో చెప్పారని, ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారన్నారు. మెగా డీఎస్సీపై ఎవరికీ నమ్మకం లేదన్నారు గంటా. టీడీపీ-జనసేన సీట్లపై ఇప్పటికే క్లారిటీతో ఉందన్నారు. ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేయాలన్నదానిపై స్పష్టత ఉందన్నారు. త్వరలోనే అభ్యర్థుల్ని ఖరారు చేస్తారన్నారు. రెండ్రోజులా, వారం రోజులన్నది తేలుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి సీట్లు మార్చడాన్ని విమర్శించిన మీరు, మిమ్మల్ని జిల్లా మార్చడంపై ఏమంటారని అడగ్గా.. దీనిని షఫిలింగ్ అని అనరని గంటా చెప్పారు.