ఇక కీమోథెరపి సైడ్‌ఎఫెక్ట్స్‌కు చెక్
ప్రపంచవ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను ఎంతో మంది క్యాన్సర్‌తో పీడించబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా అనేక మంది ఈ కాన్సర్ చికిత్స పొందుతూ నరక యాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఈ కాన్సర్‌ను నివారించడానికి చేసే కీమో థెరపీ కారణంగా అనేకమంది ఎన్నో దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్యాన్సర్ నివారణలో భాగంగా చేసే కీమోథెరపి వల్ల వచ్చే సైడ్ఎఫెక్ట్స్ కారణంగా ఎంతోమంది తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. అయితే ఈ దుష్ప్రభావాలను నివారించేందుకు ఐఐటీ గుహవటి శాస్త్రవేత్తలు సరికొత్త వ్యూహాన్ని అభివృద్ది చేశారు. దీనిలో భాగంగా కాన్సర్ బారినపడ్డ కణాల్లోకి కీమోథెరపి ద్వారా నేరుగా మందును పంపిస్తారు.

సాధారణంగా ప్రస్తుతమున్న కీమోథెరపి క్యాన్సర్ కణాలను మాత్రమే కాకుండా శరీరంలో ఉండే ఆరోగ్యకరమైన ఇతర కణాలను కూడా చంపేస్తుంటుంది. దీనివల్ల క్యాన్సర్ పేషంట్లు అనేక రకాల దుష్ప్రభావాలకు గురి అవుతూ.. ఉంటారు. అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఒక అభిప్రాయం కూడా ఉంది. అందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి ఐఐటీ గుహవటి శాస్త్రవేత్తలు ప్రత్యేక మాలిక్యూల్స్‌ను రూపొందించారు. ఈ మాలిక్యూల్స్ అన్నీ తమంట తామే ఒక చోటుకి చేరి కీమో ఓషదాన్ని ఒడిసిపడతాయి. అంతేకాకుండా ఇవి క్యాన్సర్ కణాలకు మాత్రమే అతుక్కుంటాయి. వీటిపై పరారుణ కాంతి కిరణాలను ప్రయోగించినప్పడు అవి విచ్ఛిన్నమవుతాయి.తద్వారా ఆమందు క్యాన్సర్ కణాల్లోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా క్యాన్సర్ పేషంట్లు కీమో దుష్ప్రభావాల నుంచి బయటపడొచ్చని ఐఐటీ గుహవటి శాస్త్రవేత్తలు తెలిపారు.

