ఒక్క పరీక్షతో అన్ని రకాల క్యాన్సర్లకు చెక్ (MCED TEST)
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. ముదిరిపోతే బ్రతకడం కష్టం. కానీ తొలిదశలో గుర్తిస్తే ఆ రోగిని సులువుగా కాపాడుకోవచ్చు. అందుకే తరచుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోమంటూ డాక్టర్లు సూచిస్తుంటారు. ఈ క్యాన్సర్‌ను కనిపెట్టడానికి అనేకరకాల పరీక్షలు ఉన్నాయి. అయితే ఈ పరీక్షలను చేయించుకోవడం ఎంతో ఖర్చుతోనూ, శ్రమతోనూ కూడుకున్న పని. ఒక్కో రకమైన క్యాన్సర్‌కు ఒకో రకమైన పరీక్ష ఉంటుంది. పేగుక్యాన్సర్‌కి ఒకటి, బ్రెస్ట్ క్యాన్సర్‌కి ఒకటి, సర్వికల్ క్యాన్సర్‌కి ఒకటి ఇలా రకరకాల పరీక్షలు ఉన్నాయి. అయితే అన్నిరకాల క్యాన్సర్‌లను ఒకే పరీక్షతో గుర్తించగలిగితే ఎంత బాగుంటుంది. ఈ ఆలోచనతో కనిపెట్టినదే మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ టెస్ట్స్- (MCED). దీనితో అన్ని రకాల క్యాన్సర్ పరీక్షల ఇబ్బందులు తొలగుతాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ “క్యాన్సర్ మూన్‌షాట్” అనే కార్యక్రమం ద్వారా ఈ పరీక్షల విధానాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ విధానం ద్వారా సమీప భవిష్యత్తులో క్యాన్సర్ పరీక్షల తీరుతెన్నులే మారిపోబోతున్నాయి. ఈ పరీక్షవిధానం ఏమిటంటే క్యాన్సర్ కణితి కణాలు రక్తప్రసరణ వ్యవస్థలోకి డిఎన్‌ఏను విడుదల చేస్తాయి. దీనిని శోధించడం ద్వారా అది ఎలాంటి కణజాలం, సాధారణమైనదా? క్యాన్సర్ కణజాలమా? అని తెలుసుకోవచ్చు. లిక్విడ్ బయాప్సీ ద్వారా ఇప్పటికే క్యాన్సర్ చివరిదశలోని రోగులకు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ దశలోని రోగుల నుండి ఎక్కువమొత్తంలో క్యాన్సర్ కణితి డీఎన్‌ఏ రక్తంలో కలుస్తుంటుంది. ఇప్పుడు ఈ MCED ద్వారా క్యాన్సర్ మొదటి దశలోనే ఈ క్యాన్సర్ కణాలను గుర్తించడం జరుగుతుంది. ఈ పరీక్షలు క్యాన్సర్ కణాలకు, మామూలు కణాలకు తేడాను గుర్తించి, వర్గీకరిస్తాయి. క్యాన్సర్ కణజాలంలోని డీఎన్‌ఏలో పరమాణు బార్‌కోడ్ వంటి వాటిపై దృష్టి పెట్టడం ద్వారా వీటిని గుర్తిస్తాయి. ఈ కణాలలో అసాధారణ డీఎన్‌ఏ మిథైలేషన్ ఉంటుంది. దీనిద్వారా ఆ క్యాన్సర్ శరీరంలోని ఏ అవయవంలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. అందువల్ల ప్రత్యేకించి పరీక్షలు అవసరంలేదు. తొలిదశలోనే క్యాన్సర్ కణాలను గుర్తించవచ్చు.

