మహారాష్ట్రలో కలకలం… పడవలో ఏకే-47 రైఫిళ్లు
మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్‌గఢ్ తీరంలో 3 ఏకే-47 రైఫిళ్లు బుల్లెట్లతో కూడిన అనుమానాస్పద పడవను ఉదయం 8 గంటల సమయంలో గుర్తించిన స్థానిక మత్స్యకారులు భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు. ముంబైకి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవర్ధన్ ప్రాంతంలో సిబ్బంది ఎవరూ లేని పడవను గుర్తించారు. సమాచారం తెలుసుకున్న రాయ్‌గఢ్ ఎస్పీ అశోక్ దుధే, ఇతర ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పడవను తనిఖీ చేశారు.
పడవలో 3 ఏకే-47రైఫిళ్లు, కొన్ని బుల్లెట్లతోపాటు లైఫ్ జాకెట్, కొన్ని అనుమానాస్పద వస్తువులు దొరికాయి. కోస్ట్ గార్డ్ కమాండర్ జనరల్ పరమేష్ శివమణి మాట్లాడుతూ.. ఈ పడవ జూన్ 26న ఎమర్జెన్సీ కాల్ చేసిందని, గల్ఫ్‌ఆఫ్ ఒమన్ నుండి నలుగురు ప్రయాణికులను రక్షించారన్నారు. ఇది యుకెకు ప్రయాణిస్తోందని, యుకె జెండాను కలిగి ఉందని అన్నారు. పడవ రాయ్‌గఢ్ తీరానికి తేలుతూ వచ్చిందన్నారు. పడవ గురించి మరింత తెలుసుకోవడానికి అధికారులు స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. మహారాష్ట్ర ఎటిఎస్ బృందాన్ని కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. శ్రీవర్ధన్‌లో అనుమానాస్పద పడవ కనిపించడంతో జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పడవలో రైఫిళ్లు, బుల్లెట్లు లభించడంతో చుట్టు పక్కలవారు ఆందోళన చెందుతున్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ వార్తపై స్పందించారు. పోలీసు అధికారులందరినీ హై అలర్ట్‌లో ఉంచామని, ఈ సమస్యకు సంబంధించి భారత కోస్ట్ గార్డ్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు. పడవ ఎక్కడి నుంచి వచ్చింది? అందులో దొరికిన ఆయుధాలు ఎవరు పంపారు? పడవలో ఎవరైనా వచ్చారా? ఎవరైనా వస్తే ఇప్పుడు ఎక్కడున్నారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో ఉగ్రవాదులు ముంబైలో 26/11 జరిగిన దాడి తరహాలో భాగంగా మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.