Andhra PradeshNews

వైసీపీలో త్వరలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు ?

 

◆ ఎన్నికలకు సిద్ధమవుతున్న జగన్
◆ ఇప్పటికే జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు మార్పు
◆ డిసెంబర్ 14న ఎమ్మెల్యేలతో వర్క్ షాప్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి ఆఖరిలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ఊహగానాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వేస్తున్న అడుగులు కూడా ఈ ఆలోచనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాల్లో భాగంగానే సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టారు. ఆ క్రమంలోనే ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై వరుసగా సమీక్షలు జరుపుతూ ప్రజలతో మమేకం అవ్వని ఎమ్మెల్యేలకు ఆయన నేరుగా హెచ్చరికలు కూడా చేశారు. పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదని స్పష్టమైన సంకేతాన్ని ఎమ్మెల్యేలకు సూటిగా చెప్పారు. ఎమ్మెల్యేలతో వర్క్ షాపులు నిర్వహిస్తున్న క్రమంలోనే పోయినసారి జరిగిన సమావేశంలో 27 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలని కూడా సూచించారు.

No photo description available.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే నేపథ్యంలోనే ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరుచుకోవాలని వారికి సూచిస్తూనే ప్రజల్లో గ్రాఫ్ లేని ఎమ్మెల్యేలను మార్చే దిశగా ఆయన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. ప్రతిరోజు ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలపై నివేదికలను తెప్పించుకొని సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. తాజాగా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు నియామకంలో సీఎం జగన్ తన మార్క్ నిర్ణయాలు తీసుకొని ఎన్నికలకు తన టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో వరుస వర్క్ షాపులు నిర్వహిస్తున్న జగన్ వాస్తవానికి డిసెంబర్ 4వ తేదీన మళ్లీ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ వర్క్ షాప్ ను డిసెంబర్ 14వ తేదీకి మార్చినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. బోర్డర్ లో ఉన్న ఎమ్మెల్యేలకు చివర అవకాశం కల్పించే దిశగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలానే గతంలో సరిగా పనిచేయని మంత్రులకు జగన్ క్లాస్ తీసుకోవడంతో వారి ప్రవర్తనలో కూడా మార్పులు కనిపిస్తున్నట్లు రోజువారి ఆయనకు అందుతున్న నివేదికల ద్వారా తెలుస్తోందట. అందుకే సీఎం జగన్ ఎమ్మెల్యేలకు మంత్రులకు మరో అవకాశం కల్పించేందుకు తేదీని మార్చినట్లు ప్రచారం సాగుతుంది.

No photo description available.

సమయం దగ్గర పడే కొద్ది ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరుగుతుంది. అందులో గతంలో హెచ్చరించిన ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి నివేదికలను కూడా రానున్న వర్క్ షాప్ లో జగన్ వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఈసారి జరిగే సమావేశంలో సీఎం జగన్ పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేల స్థానంలో ఆయా నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమించనున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో బలంగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కొనసాగిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే భావనలో సీఎం జగన్ ఉన్నారట. ఇప్పటికే ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులుగా సీనియర్ల విషయంలోనూ నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ ఎమ్మెల్యేల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకొని మార్పులు చేయబోతున్నారట. దీంతోపాటు ప్రతి నియోజకవర్గానికి సమన్వయకర్తల పేర్లను కూడా ఈ సమావేశంలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయిస్తానని ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ అధినేత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమందికి తిరిగి సీట్లు కేటాయిస్తారనేది డిసెంబర్‌లో జరిగే సమావేశ తర్వాత క్లారిటీ రానుంది. ఏదేమైనప్పటికీ ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారనేది విశ్లేషకులు భావన.