చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా చంద్రయాన్ -3 ప్రవేశం
జాబిల్లి రహస్యాలను చేధించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ ప్రయోగించిన చంద్రయాన్-3 కీలక దశను సునాయాసంగా దాటేసింది. విజయవంతంగా భూకక్ష్యను వదిలి, చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఇస్రో శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇప్పటివరకూ ఐదు దశలను పూర్తి చేసి, ఆరవదశలోకి ప్రవేశించింది చంద్రయాన్. సోమవారం అర్థరాత్రి 12 గంటల అనంతరం ఈ వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఇప్పుడు చంద్రుని చుట్టూ అనేక పరిభ్రమణల అనంతరం ఆగస్టు 23 లేదా 24 వ తేదీలలో చంద్రునిపై విక్రమ్ ల్యాండర్‌ను ల్యాండ్ చేస్తుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి, భూమి కన్నా తక్కువగా ఉండడం, భిన్నంగా ఉండడం వల్ల, అక్కడి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.

ఇకపై జరుగబోయే ప్రతి ప్రక్రియ శాస్త్రవేత్తలకు సవాలుగానే ఉండబోతోంది. దీర్ఘ వృత్తాకారంలో జరిగే ఈ పరిభ్రమణం, ఎక్కువ దూరం నుండి మొదలై, క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇస్రో దీని ప్రయాణ వ్యాసార్థాన్ని తగ్గిస్తూ చివరికి 100 కిలోమీటర్ల దూరంలో చంద్రుడున్నప్పుడు ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండింగ్ మాడ్యూల్‌ను ఆగస్టు 17న విడదీస్తుంది. చివరికి ఆగస్టు 23 లేదా 24న చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ మాత్రమే ల్యాండ్ అవుతుంది. వీటిలో వ్యోమనౌక నుండి ల్యాండర్‌ను విడగొట్టడం, చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావడం చాలా ముఖ్యమైన ఘట్టాలు. ఈ సారి ప్రయోగం పూర్తిగా విజయవంతం కావాలని ఆశిద్దాం.

