Andhra PradeshNews

చంద్రబాబు దూరదృష్టి … 40 శాతం టికెట్లు యువతకే !

◆ పలు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న యువ నేతలు
◆ వారసులను బరిలోకి దింపటానికి చక్రం తిప్పుతున్న సీనియర్లు
◆ వారసుడు లోకేష్‎తో కలిసి నడిచేలా వ్యూహం అంటున్న విశ్లేషకులు
◆ తెరపైకి ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఫార్ములా

ఏపీలో ప్రస్తుతం ముందస్తు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది పక్కన బెడితే అటు వైసీపీ, ఇటు చంద్రబాబు రెండు పార్టీలు ఎన్నికల గోదాలోకి దిగినట్టుగా కన్పిస్తోంది. 2024కు ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ లీడర్లు, క్యాడర్ సిద్దంగా ఉండాలని చంద్రబాబు సూచించడంతో ఏపీలో ఎన్నికల వేడి పెరిగింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చంద్రబాబు సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాదుడే బాదుడు పేరిట నిత్యావసరాలు, ప్రభుత్వ పన్నుల పెంపుపై నిరసనలు చేపడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తుతున్నారు. ఇప్పుడు యువతకు పార్టీలో ప్రాధాన్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండేలా పార్టీ లీడర్లను, క్యాడర్‌ను చంద్రబాబు సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల్లోకి వెళితే, టీడీపీ బాదుడే బాదుడు పేరిట వెళుతోంది. ఈ రెండింటినీ గమనిస్తే ప్రజల మద్దతు ఎవరికి ఉందో స్పష్టంగా తెలుస్తుందని టీడీపీ భావిస్తోంది. ప్రజల్లోకి వెళ్లిన టీడీపీకి స్వాగతాలు, గడపగడప కార్యక్రమంలో వైసీపీ నేతలకు నిలదీతలు అందుకు నిదర్శనమని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకంగా మారిన క్రమంలో చంద్రబాబు నాయుడు ఎలా అయినా అధికారాన్ని దక్కించుకునేందుకు వ్యూహారచనలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో వయసు రిత్యా కొంత ఇబ్బందులు పడుతున్న చంద్రబాబు భవిష్యత్తులో తన రాజకీయ వారసుడు నారా లోకేష్‌కు ఇబ్బందులు లేకుండా ఆయనతో జీవితకాలం నడిచే విధంగా యువ నాయకులను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు కేటాయిస్తానని స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. చంద్రబాబు ఈ ప్రకటన చేయడంతో టీడీపీలో ఉన్న సీనియర్లు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు తమ వారసులను నియోజకవర్గాల్లో తిప్పుతూ పట్టు సాధించే దిశగా వ్యూహాలు రచిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు తమకు బదులుగా తమ వారసులకు టికెట్లు ఇప్పించి రంగంలోకి దింపేందుకు అధిష్టానంపై ఒత్తిడి కూడా తీసుకువస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో దాదాపుగా 15 నుండి 25 మందికి పైగా ముఖ్య నేతల వారసులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

గత ఎన్నికల్లో కొందరు వారసులకు పోటీ చేసే అవకాశం దక్కినా కూడా వైసీపీ ప్రభంజనంతో పరాజయం పాలయ్యారు. అయితే ఈసారి ఎలాగైనా మరోసారి టికెట్ దక్కించుకొని తమ సత్తా చాటేందుకు నియోజకవర్గాల్లో పాగా వేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తూ కొంతమందికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఒక కుటుంబం నుంచి కేవలం ఒక్కరికే టికెట్ ఇస్తామని అందరికీ ఒకటే ఫార్ములాను అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. యువతకు కేటాయించే 40 శాతం టికెట్లు పార్టీ కోసం బాగా కష్టపడి ప్రజల్లో మంచి పేరు ఉన్నవారికి టికెట్లు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. నారా లోకేష్‌తో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసే యువ నాయకులకు మంచి ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తును అందించాలన్న ధృడ సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఒకవేళ పొత్తులు ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు అవసరం అవుతుందన్న నేపథ్యంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తూ వ్యవహరిస్తున్నారు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది.