విచారణ జరిగితే చంద్రబాబుకు శిక్ష ఖాయం: సజ్జల రామకృష్ణారెడ్డి
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అక్రమాలు జరగలేదని బాబు తరఫున లాయర్లు సుప్రీంకోర్టులో ఒక్క ఆధారం కూడా చూపించలేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును నామినేషన్ పద్ధతిలో సీమెన్స్ కంపెనీకి అప్పగించారని… 370 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు. ఒక ప్రైవేటు వ్యక్తిని తెచ్చి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో, తన సీఈవోగా చేసుకున్నారన్నారు. మార్కెట్ స్టడీ చేయకుండానే సీమెన్స్ కంపెనీకి ప్రాజెక్టును అప్పగించారని.. 241 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారన్నారు. రూ.241 కోట్లు నిధులు దారిమళ్లాయని 2017లోనే జీఎస్టీ అధికారులు హెచ్చరించారన్నారు సజ్జల.

2018లోనే సీమెన్స్ కంపెనీ స్కిల్ స్కాంకు, మాకు ఎలాంటి సంబంధంలేదని వివరణ ఇచ్చిందని… ఈ స్కాంలో తనకు సంబంధంలేదు అని చెప్పడానికి బాబు దగ్గర ఒక్క ఆధారమైనా ఉందా అని సజ్జల ప్రశ్నించారు. రూ.371 కోట్లు కొట్టేయడానికే ప్రాజెక్టు వ్యాల్యూను రూ.3,300 కోట్లుగా చూపించారని… నిజానికి ప్రాజెక్టు వ్యాల్యూ రూ.371 కోట్లేనన్నారు. ఈ ప్రాజెక్టులో సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని చెప్పారు. షెల్ కంపెనీలు సృష్టించి రూ.371 కోట్లు దోచేశారనేందుకు ఆధారాలు ఉన్నందునే సీఐడీ పోలీసులు బాబును అరెస్ట్ చేశారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

2021లోనే సీఐడీ కేసు నమోదు చేసిందని… ఈడీ ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిందని చెప్పారు. స్కాం జరిగిందని ఆధారాలు సేకరించి ఒక నిర్ధారణకు వచ్చిన తరువాత మాత్రమే సీఐడీ బాబును అరెస్ట్ చేసిందన్నారు సజ్జల. ఏసీబీ కోర్టు కూడా స్కాం జరిగిందని నిర్ధారించుకున్నాకే బాబును జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించిందన్నారు. బాబు లాయర్లు స్కాం జరగలేదని నిరూపించకుండా క్వాష్ పిటిషన్ మీదే సుప్రీంకోర్టులో పట్టుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కేసులో విచారణ ముందుకు వెళ్తే బాబు ఎక్కడ దోషిగా నిరూపించబడతాడో అనే భయంతో ఆయన లాయర్లు విచారణకు రాకుండా సెక్షన్ 17ఏ గురించి మాత్రమే వాదిస్తున్నారన్నారు. టెక్నికల్ రీజన్స్‌ను సాకుగా చూపుతూ కేసును కొట్టేయించాలని బాబు లాయర్లు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టులో బాబుకు రూ.120 కోట్లు ముడుపులు ఇచ్చానని షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి స్వయంగా చెప్పాడన్నారు సజ్జల. కేసు ఏసీబీ పరిధిలోకి రాదని మాత్రమే బాబు ఆరోపిస్తున్నారు తప్ప, స్కాం జరగలేదని ఎక్కడా చెప్పటంలేదన్నారు. చంద్రబాబు ఇప్పటికీ తను వ్యవస్థలను మేనేజ్ చేయగలనని అనుకుంటున్నారని సజ్జల దుయ్యబట్టారు.

