బీజేపీపై నమ్మకంతో చంద్రబాబు… పొత్తు ఫలించేనా?
◆ తెలంగాణలో బీజేపీ గెలవాలంటే టీడీపీ మద్దతు అవసరం
◆ అధికారం పీఠం కోసం తెలుగుదేశం పార్టీ చకచగా అడుగులు
◆ త్వరలో ఎన్డీఏలో టీడీపీ చేరటం ఖాయం అంటున్న రాజకీయ విశ్లేషకులు
◆ ఇదే జరిగితే ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు
బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సై ?
ఏపీలో చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ గతానికి భిన్నంగా ముందుకు సాగుతూ ఎన్నికల పోరుకు సమాయత్తమవుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎలా అయినా అధికారాన్ని చేపట్టాలని లక్ష్యంతో ఆయన అడుగులు వేస్తున్నారు. తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవానికి పూర్తిగా పదును పెడుతున్నారు. ఒకవైపు పార్టీని పూర్తిస్థాయి ప్రక్షాళన చేసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించి ఆయా జిల్లాల పర్యటన నేపథ్యంలో ఒక్కొక్క అభ్యర్థిని ప్రకటిస్తూ వస్తున్నారు. పార్టీని పూర్తిస్థాయి ప్రక్షాళన చేయటం , పొత్తు కలిసిన ఎలాంటి ఇబ్బంది లేని నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం చంద్రబాబు వ్యూహ ప్రతి వ్యూహాల్లో ఒక భాగమైతే, మరొక భాగం ఎలా అయినా బీజేపీతో పొత్తు కలిసి 2014లో లాగా అధికారాన్ని చేపట్టడం.

పొత్తు లేకుంటే చిత్తవుదామన్న ఆందోళన
రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో కమలం పెద్దలతో సన్నిహితంగా మెలిగి పొత్తు పెట్టుకొని ఎలాగైనా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అలానే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ విషయంలో కొంతమేర ఆగ్రహంగా ఉన్న బీజేపీ పెద్దలు ఇప్పుడు మెత్తబడినట్లు కనిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ప్రధాని మోడీతో చంద్రబాబును కలవడం… తాజాగా చంద్రబాబుకు కేంద్రం అదనపు భద్రత కల్పించడం ఢిల్లీలో కూడా తెలుగుదేశం పార్టీ గురించి బీజేపీ నాయకులు పాజిటివ్ గా మాట్లాడటం పొత్తులు ఖాయమనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.

తెలంగాణ లింకు, ఏపీలో పొత్తు లెక్కలు
తెలంగాణలో బీజేపీకి, టీడీపీ, జనసేన పొత్తు అవసరమని భావిస్తున్న తరుణంలో తెలంగాణలో కమలం బలపడాలంటే తెలుగుదేశం పార్టీ కూడా అవసరమని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ప్రాబల్యం తగ్గినా కూడా వారికి బలమైన ఓటు బ్యాంకు ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉందని దీనికి తోడు జనసేన కూడా ప్రభావితం చేస్తుందని దీంతో తెలంగాణలో కేసీఆర్ ను గద్దెదించి అధికారం కైవసం చేసుకోవచ్చన్న భావనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా నిలిచి తెలంగాణలో అధికారం చేపట్టవచ్చని బీజేపీ భావిస్తుంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైన గడువునప్పటికీ అన్ని పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నాయి.

2014… 2024లో రిపీట్ అవుతుందా?
తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తే వైసీపీకి గడ్డు కాలమే అని, జగన్‌కు కేంద్రం నుంచి ఎలాంటి సపోర్టు ఉండకపోగా జనసేన కూడా ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండటంతో 2014 లాగా గెలుపు 2024 అవకాశాలు టీడీపీకే ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు జిల్లాల పర్యటనలు తెలుగుదేశం పార్టీ శ్రేణులును ఉత్సాహ పరుస్తున్న నేపథ్యంలో, ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తున్న తరుణంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ దసరా నాటికి బీజేపీతో పొత్తు కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్ గద్దె దింపి అధికారం కైవసం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరి టీడీపీ అధినేత వ్యూహాలు ఫలిస్తాయా ? పొత్తుకు బీజేపీ ఒప్పుకుంటుందా ? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికార కైవసం చేసుకుంటుందా లేదా ? అనేది వేచి చూడాల్సిందే…

