Andhra PradeshHome Page Slider

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి సీఎంకు వివరిస్తాం..

తాడేపల్లి : మీకాళ్లు పట్టుకుంటాం.. సీఎంను కలవనివ్వండి.. చంద్రబాబుకి ఆరోగ్యం బాగోలేదు. కనీసం ఫ్యామిలీ డాక్టర్‌ను అనుమతించమని కోరతాం అంటూ తెదేపా నాయకులు బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యాలరావులు పోలీసులను వేడుకున్నా.. కనికరించలేదు. సీఎం జగన్‌ను కలిసి చంద్రబాబు ఆరోగ్యంపై వివరించేందుకు శుక్రవారం మధ్యాహ్నం పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తాడేపల్లి పాత టోల్‌గేట్  కూడలి వద్దకు వచ్చారు. తాడేపల్లిలోని సీఎం నివాసం వద్దకు వెళ్తుండగా పోలీసులు అడుకున్నారు. అనంతరం డీఎస్పీ రాంబాబు, సీఐ శేషగిరిరావు తమ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న పోలీసులతో మాట్లాడుతూ.. తాము ధర్నా చేయడానికి రాలేదని, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని సిఎంకు వివరించేందుకు వచ్చామని చెప్పారు. కేవలం ఇద్దరినే అనుమతిస్తామని ముందు చెప్పిన పోలీసులు తర్వాత మాట మార్చారు. ఎవరినీ అనుమతించబోమని చెప్పడంతో మీ కాళ్లు పట్టుకుంటామని.. వెళ్లడానికి అనుమతినివ్వాలని తెదేపా నేతలు వేడుకున్నారు. అయినా పోలీసులు నిరాకరించడంతో సీఎం ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించిన పిల్లి మాణిక్యాలరావును బలవంతంగా డీఎస్పీ రాంబాబు పోలీసు వాహనం ఎక్కించారు. అనంతరం సీఐ శేషగిరిరావు సిబ్బందితో కలిసి బుద్దా వెంకన్నను వాహనం ఎక్కించి దుగ్గిరాల పోలీసు స్టేషన్‌కు తరలించారు.