ఎస్సీ, ఎస్టీలకు చంద్రబాబు గుడ్‌న్యూస్..
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు శుభవార్త చెప్పారు. ఏపీలో కేంద్రప్రభుత్వం నుండి రాష్ట్రానికి వచ్చే అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటామని వ్యాఖ్యానించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద కేంద్రప్రభుత్వం అందిస్తున్న సోలార్ ఎనర్జీ పథకాన్ని రాష్ట్రంలోని అర్హులందరికీ వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ వారికి ఉచితంగా ఈ పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. 2 కిలోవాట్స్ ( 240 యూనిట్లు) విద్యుత్ వారికి ఉచితంగా లభిస్తుందన్నారు. ఈ మొత్తం పథకానికి కేంద్రం 60 వేల కోట్లు, రాష్ట్రం 50 వేల కోట్లు రూపాయలు సమకూరుస్తుంది. దీనితో గ్రీన్ ఎనర్జీని ప్రతీ ఇంటికీ అందజేస్తామని పేర్కొన్నారు. ప్రతీ ఎమ్మెల్యే వారి నియోజకవర్గ పరిధిలో అర్హులను గుర్తించాలని, ప్రతీ నియోజకవర్గానికి 10 వేల ఇళ్లను గుర్తించాలని పేర్కొన్నారు. 100 శాతం ఎస్సీ, ఎస్టీలకు వర్తిస్తుంది. ఇతరులకు కూడా అర్హతలను బట్టి అందిస్తామన్నారు. ప్రతీ వారూ వారి ఇంటికి సరిపోగా మిగిలినది గ్రిడ్‌కు అందిస్తే, వారికి మిగులు కరెంటు ఛార్జీలు కూడా ఇస్తామని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో ఊహించని అవకాశాలు ఏర్పడుతున్నాయని, భవిష్యత్తులో ఓడలు, విమానాలు కూడా గ్రీన్ ఎనర్టీతోనే పనిచేస్తాయన్నారు.