Andhra PradeshHome Page Slider

చంద్రబాబు తొలిసంతకం దానిమీదే…

ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం పోలవరం ప్రాజెక్టు మీదేనని పేర్కొన్నారు ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంతో కష్టపడి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశామని, అందుకే పోలవరం ప్రాజెక్టు నాడు సాధ్యమయ్యిందని పేర్కొన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలతో ముడిపడి ఉన్న కోర్టు కేసులన్నీ విత్‌డ్రా చేయించి నాడు పోలవరం ప్రాజెక్టు 70 శాతం పూర్తి చేశామన్నారు. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యపు ధోరణి వల్ల వేల కోట్ల రూపాయలు వృధా అయ్యిందన్నారు. వారి చర్యల వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతినిందని, ఇప్పుడు శరవేగంగా దానిని పూర్తి చేయవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర నడిబొడ్డులో ఉన్న అమరావతే రాష్ట్రరాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అభివృద్ధిని అటకకెక్కించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా రాజధాని లేని ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు. అందుకే విశాఖను ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుస్తామని, కర్నూల్‌ను సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అనే బేధం లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అఖండ విజయాన్ని సమకూర్చారని, అందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత మనపై ఉందని, ప్రతీ జిల్లాను అభివృద్ధి చేస్తామని  కూటమి సమావేశంలో ప్రకటించారు.