Andhra PradeshHome Page Slider

ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారా?

Share with

బీజేపీ హైకమాండ్‌కు చంద్రబాబు బిగ్ ఆఫర్
వ్యూహాలకు పదును పెడుతున్న చంద్రబాబు
ఎన్నికల సమరానికి వివిధ పార్టీలతో పొత్తులు
స్పష్టత తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు

ఏపీలో ఎన్నికల సమరానికి గడువు ముంచుకొస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ పొత్తులపై ఒక స్పష్టత తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో కలిసి ఉమ్మడిగా బరిలోకి దిగాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అయితే స్థానిక పరిస్థితులు ఇతర అంశాల నేపథ్యంలో పొత్తులపై ఇంతవరకు సరైన స్పష్టత రాలేదు. అయితే ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబునాయుడు రెండు రోజులపాటు అక్కడే మకాం వేసి భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలతో ఏకాంతంగా సమావేశం అయ్యారు. ఢిల్లీ వేదికగా పొత్తులు ఉంటాయని త్వరలోనే స్పష్టత వస్తుందని చంద్రబాబు ప్రకటించారు. దీంతో మళ్లీ మూడు పార్టీల మైత్రిపై రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఒక బిగ్ ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆ పార్టీకి 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలతో పాటు నాలుగు పార్లమెంటు సీట్లను కేటాయించే ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం. ఒకవైపు జనసేన పార్టీతో పొత్తు దాదాపుగా ఖరారైనట్లుగా స్పష్టమవుతుంది. ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య టికెట్ల కేటాయింపుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 45 పైగా అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంట్ స్థానాలను జనసేన ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం అన్ని సీట్లు కాకుండా కొన్ని కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రతిపాదనలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు భారతీయ జనతా పార్టీని ఒప్పించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

జనసేన, భారతీయ జనతా పార్టీలు తెలుగుదేశం పార్టీకి తమ అవసరం ఎంతో ఉందని దీంతో తమ ప్రతిపాదనలకు ఆ పార్టీ అంగీకరిస్తుందన్న భావనలో ఆ పార్టీలు ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అంశంపై కొంత మౌనాన్ని వహిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి కొత్త ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాత్రం 30 నుండి 40 స్థానాలకు మాత్రమే పొత్తులు కుదిరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే పొత్తులపై స్పష్టత వస్తుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.