Andhra PradeshHome Page Slider

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ శుక్రవారానికి వాయిదా

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం వాదనలు విన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మంగళవారం న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించగా, సిఐడి తరపున అటార్నీ జనరల్ (ఎజి) శ్రీరామ్ ఈరోజు వాదనలు వినిపించారు. ఏప్రిల్ 27, 2022న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 9న సీఐడీ కేసు నమోదు చేసింది. రాజధాని మహా ప్రణాళిక రూపకల్పన, కనెక్టింగ్ రోడ్స్, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన పూర్వాపరాలను చంద్రబాబు తరపున సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా కోర్టుకు సమర్పించారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారనే వాదన వినిపిస్తోంది. కాగా, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నిందితుడు ఏ14గా పేర్కొన్న నారా లోకేష్ కూడా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.