ఏపీలో సైకో పాలన అంతానికి సమయం ఆసన్నమైందన్న చంద్రబాబు
ఏపీలో సైకో పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్డు షోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధోగతి పాలు చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి సైకో మాదిరిగా తయారయ్యారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్ ప్రభుత్వం, ప్రతి గ్రామంలోనూ సైకోలను తయారు చేసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో నాలుగేళ్ల వైసీపీ పాలనలో అన్ని బాదుడే బాదుడని, రాష్ట్రంలో నిత్యవసర సరుకులను విపరీతంగా పెరగటానికి కేంద్రమే కారణమని ముఖ్యమంత్రి తప్పుడు మాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్రోలు ధరలు పెరిగాయని ఇంటి పన్నులు విపరీతంగా పెంచారని ఆరోపించారు. జగన్ పాలన పట్ల అందరిలో అభద్రత భావం నెలకొందని ఈ ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపకపోతే రాష్ట్రం మరింత అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.