చంద్రబాబు అరెస్ట్ తప్పదు : సజ్జల రామకృష్ణారెడ్డి
చంద్రబాబు నాయుడు స్కాములపై అన్ని ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పుతో విచారణ మరింత సులభతరం అవుతుందని, అరెస్ట్ తప్పదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. స్కాములపై విచారణను తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేయడమే ఒక దుస్సాహసమని, దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కాం అమరావతిలో జరిగిందన్నారు. అమరావతిలో అవినీతి దేశంలోనే ఒక కేసు స్టడీగా అభివర్ణించారు.అరెస్టు చేస్తే ప్రతిపక్షాలపై వేధింపులు అంటారు లేదంటే ధైర్యం ఉందా అని తొడలు కొడతారు మరి ఏం పీకుతామని భయపడి తెలుగుదేశం పార్టీ వాళ్లు కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు.

చంద్రబాబు అవినీతికి సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు ఏ దృక్కోణం నుంచి చూడాలో అలానే చూసిందని సజ్జల అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నప్పుడు దాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చట్ట ప్రకారం గత తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన స్కాములపై ఒక సబ్ కమిటీ వేశామన్నారు. చర్చలు చేసి ఆ నివేదికను శాసనసభలో కూడా పెట్టి చర్చించామన్నారు. దానిపై శాసనసభ స్పీకర్ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరమన్న తర్వాత సిట్ ఏర్పాటయిందన్నారు. ఇంత విశాల దృక్పథంతో తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్లు చాలెంజ్ చేయడమే ఒక దుస్సాహసమంటూ దుయ్యబట్టారు.

అమరావతిలోని రింగ్ రోడ్డు అసైన్డ్ భూముల విషయంలో విడివిడిగా ఇప్పటికే సిఐడి విచారణ చేస్తోందని సజ్జల చెప్పారు. చంద్రబాబు ఆయన దొంగల ముఠా అసలు ఎందుకు అంతగా భయపడుతున్నారనేది ఆలోచించాల్సిన అంశం అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి కొబ్బరికాయ కొట్టిన చంద్రబాబు పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.

