Andhra PradeshHome Page Slider

శాసనమండలిలో వైఎస్సార్సీపీని దెబ్బ కొట్టాలని వ్యూహం పన్నిన చంద్రబాబు

• ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ స్థానాల గెలుపు కోసం వైఎస్ఆర్సిపీ అసమ్మతినేతలకు తెలుగుదేశం వల
• ఇరు పార్టీలకు పెను సవాలుగా మారిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
• ఏడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచే తీరాలని సీఎం జగన్ వ్యూహం

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైయస్సార్సీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలకు పెను సవాల్ గా మారాయి. ఏడు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఆరు స్థానాలు వైయస్సార్సీపీ ఖాతాలో పడనున్నాయి. మిగిలిన ఆ ఒక్క స్థానాన్ని సొంతం చేసుకొని తన పట్టు నిలుపుకోవాలని అధికారపక్షం పావులు కదుపుతుండగా కీలకమైన ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకొని పట్టభద్రుల తరహాలోనే తన పట్టును నిలుపుకోవాలని తెలుగుదేశం పార్టీ వూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ఈనెల 23వ తేదీన జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేయగా వైఎస్ఆర్సిపీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. అధికార పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. అటువంటి వారిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గుర్తించి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇదే అంశాన్ని ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు చేరవేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏడో ఎమ్మెల్సీ స్థానం చేజారి పోకుండా ఉండేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగారు.

తెలుగుదేశం పార్టీకి టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో ఆరా తీసే పనిలో పడ్డారు. అందుకోసం గత రెండు రోజులుగా ఆయన ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించి ఎలాగైనా ఆస్థానాన్ని కూడా గెలిచి తీరాలని ముఖ్య నేతలకు సూచిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం కూడా రంగంలోకి దించిన అభ్యర్థి పంచుమర్తి అనురాధను గెలిపించి మండలికి పంపాలని పట్టుదలతో ఉంది. దీంతో ఇరు పార్టీల్లోనూ 23వ తేదీ ఏం జరుగుతుందో అని టెన్షన్ కనిపిస్తుంది. ఎమ్మెల్సీ కోటాలో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క స్థానానికి ఓటు వేయాల్సి ఉంది. ఆ లెక్కన వైఎస్ఆర్ సీపీకి ఆరు స్థానాలు సునాయాసంగా దక్కుతాయి. ఏడో స్థానానికి కూడా జనసేన ,తెలుగుదేశం నుండి పరోక్షంగా మద్దతు ఇస్తున్న నలుగురు సభ్యులతో గెలిచే అవకాశం ఉంది. అయితే అధికార వైఎస్ఆర్సిపీ నుండి ఇద్దరు సభ్యులు దూరం జరిగారు. దీంతో ఇప్పుడు ఈ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది. అధికార వైఎస్ఆర్ సీపీకి 151 స్థానాలు ఉండగా తెలుగుదేశానికి 23 జనసేనకు ఒకటి వంతున సభ్యులు ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నలుగురు సభ్యులు గత కొంతకాలంగా సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా అదే దారిలో ఉన్నారు.

మొత్తంగా వైయస్సార్సీపీ బలం 156 కు చేరగా తెలుగుదేశం పార్టీ బలం 19కు పడిపోయింది. ఈ క్రమంలోనే వైయస్సార్సీపీ నుండి ఇద్దరు సభ్యులు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరం జరగటంతో వైఎస్ఆర్సిపీ బలం 154 కు పడిపోయింది. ఈ లెక్కన కూడా ఏడో స్థానం నూటికి నూరు శాతం వైఎస్ఆర్సిపీ సొంతం చేసుకునే అవకాశాలు కనిపి స్తున్నాయి. అయితే 20 మందికి పైగా శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారని వారిలో కొందరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. అయితే సభ్యులు కూడా తెలివిగా వ్యవహరించే పరిస్థితి ఉందని ఇటు వైఎస్సార్ సీపీ అటు తెలుగుదేశం పార్టీలు ముందస్తు ఆలోచన చేస్తున్నాయి. ఇరు పార్టీలు విప్ జారీ చేసిన సందర్భంలో ఓటింగ్ కు హాజరై చెల్లకుండా ఓటేస్తే వచ్చే ప్రమాదాన్ని కూడా వారు ముందుగానే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సభ్యులు ఓటింగ్ కు హాజరై ఓటు చెల్లకుండా వేస్తే ఏ పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న దానిపై ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఒక్కోమంత్రికి 22 మంది ఎమ్మెల్యేలను అప్పగించి ఏడుగురితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులందరికీ మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటు ఎలా వేయాలి అన్నదానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమానంగా ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇదే విధానాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అనుసరిస్తుంది. దీంతో ఇప్పుడు ఈ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మారాయి.