తెలంగాణలో సభలు.. ఏపీలో పొత్తులు… చంద్రబాబు ఎత్తులు
◆ బహిరంగ సభల ద్వారా చంద్రబాబు సరికొత్త వ్యూహాలు
◆ ఖమ్మం సభ సక్సెస్ తో టీడీపీ లో జోష్
◆ బీజేపీతో సయోధ్య దిశగా టీడీపీ అడుగులు
◆ శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
ఏపీతోపాటు తెలంగాణలో కూడా సాధారణ ఎన్నికలు జరగటానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ఇప్పటినుంచే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య సభలు సమావేశాలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలోని ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయటం వెనుక సరికొత్త వ్యూహం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో తన సత్తా చాటుకోవటం ద్వారా ఆ రాష్ట్రంలో అధికారం కోసం ఒంటరిగా పోటీ పడుతున్న బీజేపీని ఆకర్షించేందుకు టీడీపీ ఉన్నఫలంగా తెలంగాణలో భారీ సభలకు ప్రణాళికలు రూపొందించిందని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.

రానున్న వారం రోజుల్లో చంద్రబాబు మరో జిల్లాలో భారీ సభను నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తుంటే ఆ రాష్ట్రంలో తెలుగుదేశానికి పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా రానున్న ఎన్నికల్లో అవసరమైతే బీజేపీకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అండగా నిలవాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది. ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉండగా తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలను వీలైనంత త్వరలోనే అమరావతి కేంద్రంగా వేగవంతం చేయాలని యోచిస్తోంది. అందుకోసం పార్టీ కార్యాలయాన్ని క్రిస్మస్ పండుగ తర్వాత ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే సందర్భంగా తెలంగాణలో చంద్రబాబు జోరు పెంచడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.

మరోవైపు ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను కైవసం చేసుకోవాలని అందుకోసం ఇప్పటినుండే బీసీ సామాజిక వర్గాల తో పాటు కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా తమ వైపు తిప్పుకొనేలా వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల వైసీపీ కాపు నేతలు విజయవాడ కేంద్రంగా సమావేశమయ్యారు. అలానే వచ్చే ఎన్నికలు టీడీపీకి చాలా కీలకం కావటంతో ఎలా అయినా అధికారాన్ని సొంతం చేసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అందుకోసం బాదుడే బాదుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి వంటి ప్రత్యేక కార్యక్రమాల పేరుతో గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. భారీ సభలు, రోడ్డు షోలు నిర్వహిస్తూ అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు.

అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ ఢీకొనాలంటే టీడీపీకి జనసేన బీజేపీల మద్దతు అవసరం ఉంది. ఆ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇదే వాదన బలంగా వినిపిస్తుంది. చంద్రబాబు సైతం పొత్తులతోనే బరిలోకి దిగాలని ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో పలు సందర్భాల్లో చర్చించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో వైసీపీని ఓడించి అధికారాన్ని సొంతం చేసుకోవాలంటే టీడీపీ మిత్ర పక్షాలు తో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సయోధ్యకు జనసేన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్న బీజేపీ మాత్రం టీడీపీని దూరంగా ఉంచాలని చూస్తోంది. దీంతో బీజేపీ బలంగా ఉన్న తెలంగాణలో పాగా వేయడం ద్వారా టీడీపీ అవసరాన్ని కేంద్ర పెద్దలు గుర్తిస్తారన్న ఆలోచనలతో చంద్రబాబు ఆ రాష్ట్రంలో తన పార్టీ సత్తాను చాటుకునేలా వ్యూహాత్మకంగా సమర శంఖారావం పూరించినట్లు చెబుతున్నారు.

చంద్రబాబు వ్యూహాలకు తగ్గట్టుగానే ఖమ్మం లో నిర్వహించిన తొలి సభ సక్సెస్ అయింది. బీజేపీ నేతలు కూడా ఖమ్మం సభను చూసిన తర్వాత భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ అవసరం తమకు ఉంటుందన్న యోచన కూడా చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు వ్యూహాలను చిత్తు చేయాలని వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు. జయహో బీసీ సదస్సు విజయవంతంగా నిర్వహించి సత్తా చాటిన వైసీపీ అదే తరహాలో విశాఖ కేంద్రంగా కాపు సదస్సును కూడా నిర్వహించి ఆ సామాజిక వర్గం కూడా వైసీపీ వెన్నంటే ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరి రానున్న కాలంలో ఎవరి వ్యూహాలు గట్టిగా పని చేస్తాయో చూడాల్సి ఉంది.

