Andhra PradeshHome Page Slider

40 రోజులుగా జైల్లోనే చంద్రబాబు, శుక్రవారం తేలనున్న భవితవ్యం

రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్షనేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలపై అరెస్టై సరిగ్గా 40 రోజులు గడిచాయి. ఏపీ స్కెల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు రిమాండ్ గురువారంతో ముగియనుంది. ఇదే సమయంలో గత 40 రోజులుగా ఆయన చేస్తున్న న్యాయ పోరాటానికి శుక్రవారంతో క్లారిటీ రానున్నది. చంద్రబాబు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ కేసు ఫైబర్ నెట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాలు తదితర కేసుల్లో ఆయన భవిష్యత్తు తేలేందుకు ఈనెల 20వ తేదీ కీలకంగా మారనుంది.

ఇన్ని రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ బెయిల్ కోసం చేసే ప్రయత్నం కన్నా ఆయన స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ పై పెట్టిన ఫోకస్ అంతా ఇంత కాదు. ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడటంతో పాటు 17ఎ వర్తింపు అంశాన్ని గట్టిగా పట్టుకున్న చంద్రబాబు ఈ విషయంలో న్యాయపరంగా సక్సెస్ అయితే అది చారిత్రాత్మకం అవుతుంది. దీంతో తన జీవితంలో 40 రోజులు జైలు జీవితానికి దోహదపడిన జగన్ సర్కార్ కు చెంపపెట్టు కావాలనేది చంద్రబాబు అభిమతంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ శుక్రవారం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో స్కిల్ స్కాం కేసులో వెలువడే తీర్పు పట్ల సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

అదేవిధంగా చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైబర్ నెట్ కేసులోనూ ముందస్తు బెయిల్ పైన అదే రోజు సుప్రీంకోర్టులో నిర్ణయం వెల్లడి కానున్నది. దీంతో చంద్రబాబు పై నమోదైన ప్రధానమైన కేసులకు సంబంధించిన న్యాయ పోరాటం దిశగా భవిష్యత్తు కార్యాచరణ పై 20వ తేదీ నిర్ణయాత్మకం కానుంది. ఆరోజు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే రాజకీయంగా మలచుకునేందుకు ఎలాగూ పాచికలు ఉంటాయి. అదే ప్రతికూల నిర్ణయం వెలువడితే ఎలా ముందుకెళ్లాలని దానిపై న్యాయ నిపుణులతో సమాలోచనలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఈనెల 20వ తేదీ శుక్రవారం చంద్రబాబుకు కీలకంగా మారనుందనే ఆసక్తి ఉత్కంఠ అన్ని వర్గాల్లో కొనసాగుతుంది.