రూటు మార్చిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాబోయే ఎన్నికల కోసం కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. తన సంప్రదాయ రూటును మార్చి, కొత్త మార్గాలనవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు మరింత వేడెక్కుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు స్పీడును పెంచి ప్రజలలో తిరుగుతున్నారు. వచ్చిన ఏ చిన్న అంశాన్ని వదలకుండా కూడా రాజకీయాల లబ్ది కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన స్పీడును మరింత పెంచారు. ఇకనుండి పూర్తి స్థాయిలో అమరావతి లోనే మకాం వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీతోపాటు తెలంగాణలో కూడా రాజకీయంగా దూకుడు పెంచేందుకు ఆయన ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

ఇకనుండి పూర్తి సమయం అమరావతిలోనే మకాం
ఇప్పటివరకు వారంలో ఐదు రోజులు మాత్రమే అమరావతిలో అందుబాటులో ఉంటున్నచంద్రబాబు ఇకపై నిత్యం నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ఎన్నికల షెడ్యూలు మరో రెండు నెలలలోనే వెలువడే అవకాశం ఉంది. పార్టీ నేతలు, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు త్వరలో నియోజకవర్గాల వారీగా సమీక్షలను నిర్వహించేందుకు చంద్రబాబునాయుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకనుండి కీలకమైన నేతలను వ్యక్తిగతంగా భేటీ అవ్వడంతో పాటు నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటివరకు టెలికాన్ఫరెన్స్ ల ద్వారా దిశా నిర్దేశం చేస్తున్న ఆయన ఇకపై నేతలతో స్వయంగా మాట్లాడి స్థానిక పరిస్థితులను తెలుసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ముందస్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. అక్కడ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ముందస్తుగా జరిగినా సిద్ధంగా ఉండేలా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు.