స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసిన చంద్రబాబు
ఏపీలో కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నేడు పెన్షన్లు పంపిణీ చేస్తోంది. మొదటి ఫించను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే తీసుకెళ్లి అందజేయడం విశేషం. ఎన్టీఆర్ భరోసా పేరుతో కొత్త ఫించను మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో లాంఛనంగా చంద్రబాబు ప్రారంభించారు. మంత్రి లోకేష్, ఇతర అధికారులతో కలిసి ఆ గ్రామంలోని పూరిగుడిసెలో ఉన్న లబ్దిదారు రాములు ఇంటికి వెళ్లి ముగ్గురు లబ్ధిదారులకు అందజేశారు. త్వరలోనే వారికి ఇల్లు నిర్మిస్తామని ప్రమాణం చేశారు. వారి కుటుంబసభ్యులతో మాట్లాడి, వారిచ్చిన టీ తాగారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంచిన పెన్షన్ బకాయితో పాటు ఈ నెల పెన్షన్ కలిపి రూ.7000 అందజేశారు. తొలిరోజే రాష్ట్రం మొత్తం పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. సచివాలయ ఉద్యోగులు, అంగన్ వాడీ, ఆశా వర్కర్ల ద్వారా పెన్షన్లు అందజేస్తున్నారు. మొత్తం 65.18 లక్షలమందికి రాష్ట్రప్రభుత్వం రూ.4,408 కోట్లు విడుదల చేసింది.

